Oct 28,2022 23:58

మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి

ప్రజాశక్తి - యలమంచిలి
మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన అంశాల పట్ల అధికార్లు స్పందించకపోవడంపై మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు ఆరెపు గుప్తా, బెజవాడ నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారి అధ్యక్షతన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రమాకుమారి రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో జరిగిన జాప్యాన్ని గుర్తు చేస్తూ రూ.8 కోట్ల అత్యవసర ప్రత్యేక నిధులతో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు ఆరెపు గుప్తా, నాగేశ్వరరావు మాట్లాడుతూ కౌన్సిల్లో తెలియజేసిన అంశాలకు అధికార్లు కనీసం జవాబు కూడా చెప్పకపోవడం విచారకరమన్నారు. బిస్కెట్లు, స్వీట్లు కోసమా తాము వస్తున్నదీ అని విరుచుకుపడ్డారు. అసలు మినిట్స్‌ ఎవరు రికార్డు చేస్తున్నారు? వాటిని పరిష్కరించాల్సిన వ్యక్తులు ఏం చర్యలు చేపట్టారన్న సంగతి ఆ తార్వాత నెలలో జరిగే సమావేంలో వివరించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే నెల నుంచి పద్ధతి పాటిస్తామని కమిషనర్‌ వివరణ ఇచ్చారు.
మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం ఒక గంట ఆలస్యంగా మొదలైంది. 25 మంది సభ్యులకు గాను కౌన్సిల్‌కు 12 మంది మాత్రమే హాజరయ్యారు. సమావేశంలో పెద్దపల్లి కౌన్సిలర్‌ అచ్యుతరావు మాట్లాడుతూ తమ రెవెన్యూ పరిధిలో 5 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉందని దాంట్లో సామాన్యులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో అనధికార లే అవుట్ల వివరాలు సేకరించి, అక్కడ బోర్డులు వేలాడదీయాని చైర్‌పర్సన్‌ ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్‌ తోట కృష్ణవేణి, ఎంఇ వీరయ్య, ఆర్‌వో నీలిమ, మేనేజర్‌ ప్రభాకరరావు, ఎలక్ట్రికల్‌ దొర, శానిటరీ ఇనస్పెక్టర్‌ పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.