Dec 07,2022 23:22

హౌసింగ్‌ పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జెసి కల్పనా కుమారి

ప్రజాశక్తి-నక్కపల్లి:పాయకరావుపేట నియోజకవర్గం లో జగనన్న లేఅవుట్లకు సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిని బట్టి చూస్తే అధికారుల పనితీరు సక్రమంగా లేదని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక తహశిల్దార్‌ కార్యాలయంలో బుధవారం పాయకరావుపేట నియోజకర్గం నాలుగు మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఒ, హౌసింగ్‌, విధ్యుత్‌, ఆర్‌బ్లుఎస్‌ అధికారులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో జగనన్న లేఅవుట్లపై సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆయా మండలాల్లో జగనన్న లే అవుట్లకు సంబందించి వివరాలను అడిగి తెలుసు కున్నారు. ఎంత మంది ఇల్లులు నిర్మించుకున్నారు. లే అవుట్లలో సమస్యలపై ఆరా తీసారు. మండలాల వారీగా అధికారులు సమస్యలను జెసి దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న లే అవుట్‌లలో ఇలు ్లలేని వారందరికీ ఇల్లులు నిర్మించి ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో ఉందని, అధికారులు పనితీరు మాత్రం సక్రమంగా లేదన్నారు. లే అవుట్‌ లలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలు కూడా మండల స్థాయి అధికారులు పరిష్కరించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు.అధికారుల పర్యవేక్షణ లోపంతోనే లే అవుట్‌లలో గృహ నిర్మాణాలు వేగ వంతం కాలేదన్నారు. లబ్ధిదారులకు సకాలంలో సెమెంట్లు చెల్లించలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇళ్ల నిర్మాణ విషయంలో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు సరిష్కరించడంతో పనులు వేగంగా జరిగేందుకు అవకాశం ఉంంటుందని తెలిపారు. లే అవుట్లలో విధ్యుత్‌, తాగునీరు, డ్రైనేజి, రోడ్ల సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు ఇళ్ల నిర్మాణాల వేగవంతం పై కీలకపాత్ర పోషించాలన్నారు. నక్కపల్లి లే అవుట్‌ లో వీధి లైట్లకు సంబంధించిన లైన్‌ ఎందుకు ఏర్పాటు చేయలేదని ఎలక్ట్రికల్‌ ఎఈ కృష్ణ ను అడగగా, ఆయన ఇచ్చిన సమాధానంపై జెసి అసంతృప్తి వ్యక్తం చేసి మండిపడ్డారు. వెంటనే ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని సిసికి ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతగా పని చేయాలని, లే అవుట్‌ లలో నెలకొన్న సమస్యలను అధిగమించి, ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జెసి హెచ్చరించారు.