Aug 20,2023 23:44

విలేకర్లతో మాట్లాడుతున్న అనురాధ, అబద్దయ్య తదితరులు

ప్రజాశక్తి - మంగళగిరి : యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారి పేర్లను రెడ్‌బుక్‌లో రాశామని, టిడిపి అధికారంలోకి వచ్చాక వారిపై విచారణ ఉంటుందని ఎమ్మెల్సీ పి.అనురాధ, టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త ఎన్‌.అబద్దయ్య అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన యువగళం పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు స్థానిక టిడిపి కార్యాలయంలో ఆదివారం వారు విలేకర్లతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల టిడిపి శ్రేణులు సమిష్టిగా కృషి చేయడంతో పాదయాత్ర జన ప్రభంజనంతో హోరెత్తిందన్నారు. యువగళం పాదయాత్ర, హలో లోకేష్‌ కార్యక్రమం నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. నియోజకవర్గంలోని సీతానగరం వద్ద యువగళం పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడాన్ని లోకేష్‌ అదృష్టంగా భావిస్తున్నారని, పాదయాత్ర ముగిసిన తర్వాత నియోజకవర్గంలోని అందర్నీ లోకేష్‌ కలుస్తారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే మామూళ్లకు అలవాటుపడి, ఆయన అవినీతికి సహకరిస్తూ యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొంతమంది కార్పొరేషన్‌ అధికారుల పేర్లు రెడ్‌బుక్‌లో రాశామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అవినీతిపై న్యాయవిచారణ చేసి జైల్లో కూర్చోబెడతామని వ్యాఖ్యానించారు. వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నా, రిటైర్‌ అయినా, రాష్ట్ర వదిలి వెళ్లినా వదిలేది లేదన్నారు. వైస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేసిన 36 మంది అధికారులు జైలు పాలయ్యారనే విషయాన్ని అధికారులందరూ గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు పి.శ్రీనివాసరావు, ఎ.జయసత్య, వి.మైనర్‌ బాబు, ఎ.భూలక్ష్మి, డి.రాజు, షేక్‌ రియాజ్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి
తాడేపల్లి ప్రాంతంలో యువగళం పాదయాత్రను జయప్రదం చేసిన పట్టణ, రూరల్‌ ప్రజలకు టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆదివారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. లోకేష్‌ పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారని, ఇదే ఒరవడి భవిష్యత్తులో కొనసాగించాలని కోరారు.