Sep 22,2023 00:57

విద్యార్థులతో మాట్లా,డుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జీవన్‌ కృష్ణ, కార్తీక్‌

ప్రజాశక్తి-కొయ్యూరు
ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు చనిపోవడానికి ప్రభుత్వం, ఐటిడిఎ అధికారుల నిర్లక్ష్యమే కారణమని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) అల్లూరి జిల్లా అధ్యక్షులు పాంగి జీవన్‌ కృష్ణ, నాయకులు కార్తీక్‌ పేర్కొన్నారు. కొయ్యూరు మండలం, యు.చీడిపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న కిల్లో వంశీకృష్ణ (8) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ బృందం గురువారం ఆ పాఠశాలను సందర్శించింది. విద్యార్థి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీవన్‌ కృష్ణ, కార్తీక్‌ మాట్లాడుతూ గిరిజన విద్యార్థి చనిపోయి సుమారు పది రోజులవుతున్నా అధికారులు, పాలకులు నేటికీ స్పందించకపోవడం దారుణమన్నారు. పాడేరు ఐటిడిఎ పరిధిలోని 11 మండలాల్లో ఏ ఒక్క ఆశ్రమ పాఠశాలల్లోనూ హెల్త్‌ వాలంటీర్లు లేరని తెలిపారు. హెల్త్‌ వాలంటీర్లు లేకపోవడంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పట్టించుకునే నాధుడే లేరన్నారు. గిరిజన విద్యార్థులంటే అంత చులకనా? గిరిజన విద్యార్థులవి ప్రాణాలు కావా? వార్డెన్లకు విద్యార్థుల బాధ్యత పట్టదా? అని ప్రశ్నించారు. ఈ మూడు నెలల్లోనే ఐదుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా విద్యార్థుల మృతిపై విచారణ చేపట్టాలని, ప్రతి పాఠశాలలో హెల్త్‌ అసిస్టెంట్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు.