Sep 28,2023 22:00

పాఠశాల ఆవరణంలో సచివాలయం కోసం నిర్మించిన భవనం

ప్రజాశక్తి మడకశిర :  అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా అవుతోంది. ప్రభుత్వ నిధులుతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మారాయి. మండల పరిధిలోని గౌడనహళ్లి గ్రామంలో సచివాలయ భవనం లేకపోవడంతో అధికారుల నివేదిక మేరకు గ్రామంలో సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వము 40 లక్షల రూపాయలు మంజూరు చేసింది. అయితే ఆ భవనాలను సకాలంలో అనువైన స్థలంలో నిర్మించకపోవడంతో ఆ భవనం నిరుపయోగంగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నత పాఠశాల ఆవరణములో 40 లక్షల రూపాయలతో సచివాలయ భవనాన్ని నిర్మించారు. పాఠశాల ఆవరణంలో ఎలాంటి భవనాలు నిర్మించరాదని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ భవనం నిరుపయోగంగా మారింది. అదేవిధంగా రైతులకు అనుకూలంగా ఉండే విధంగా వ్యవసాయ ఉత్పత్తి కేంద్ర నిర్మాణానికి ప్రభుత్వం 21.80 లక్షల రూపాయలతో మంజూరు చేసింది. ఈ భవనం కూడా అధికారులు పాఠశాల ఆవరణంలోనే నిర్మించారు.దీంతో రైతులకు ఇది ఏమాత్రం ఉపయోగకరంగా లేకపోగా నిరుపయోగంగా దర్శనమిస్తోంది. పంచాయతీ ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం 17 లక్షల రూపాయలతో వైఎస్సార్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. ఈ భవనం కూడా పాఠశాల ఆవరణంలోనే అధికారులు నిర్మించడంతో ఆ భవనం నిరుపయోగంగా మారింది. దాదాపు 80 లక్షల రూపాయలతో వివిధ భవనాలను ఆ పంచాయతీ కేంద్రంలో చేపడితే ఒక్క భవనం కూడా ఉపయోగంలోకి రాలేదు. పాఠశాల ఆవరణంలో ఆ భవనాలు నిర్మించడంతో ఆ భవనాలను ఉపాధ్యాయులు తమ ఆధీనంలో ఉంచుకొని యోగాశాల, గ్రంథాలయం, ఆటల పోటీల సామగ్రి ఉంచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. సచివాలయంతో పాటు వివిధ విభాగాలను సరైన సౌకర్యాలు లేని అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని అనువైన స్థలంలో ప్రభుత్వ భవనాలను నిర్మించి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.