
ప్రజాశక్తి- పాచిపెంట : ఎంపిపి బి ప్రమీల అధ్యక్షతన బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి పిఆర్‌యు, ఆర్ అండ్‌బి, పిఆర్ డిఇ గైర్హాజరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపిపి, ఎంపిడిఒను కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడం లేదని బిల్లులు చెల్లింపులకు ముందుగానే పర్సంటేజీలు అడుగుతున్నారని పలు గిరిజన పంచాయతీల సర్పంచులు పిఆర్ జెఇ వరలక్ష్మిని ప్రశ్నించారు. ప్రాధాన్యత క్రమంలో బిల్లులు చెల్లిస్తున్నామని ఆమె బదులిచ్చారు. పాచిపెంట జగనన్న కాలనీలో అవినీతి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని హౌసింగ్ ఎఇ వెంకటేష్‌ను ఎంపిటిసి దండి ఏడుకొండలు ప్రశ్నించారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బిల్లులు చెల్లిస్తున్నామని ఆక్రమణలు మా పరిధి కాదని ఆయన బదులిచ్చారు. పాంచాలి, కోటికి పెంట సర్పంచులు యుగంధర్, అప్పలనాయుడు మాట్లాడుతూ కట్టిన ఇళ్లుకు బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని ఎఇ వెంకటేష్‌ను ప్రశ్నించారు. నిర్మాణాలు పరిశీలించి బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా రైతుల వద్ద ఉన్న పత్తిని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారి కే తిరుపతిరావును సభ్యులు కోరారు. ఈ సమావేశంలో జెడ్‌పి వైస్ చైర్మన్ కె.సింహాచలం, మార్కెట్ కమిటీ చైర్మన్ దండి అనంత కుమారి, వైస్ ఎంపిపిలు ఎం నారాయణ, రవీంద్ర, ఎంపిడిఒ లక్ష్మీకాంత్, తహశీల్దార్ రాజశేఖర్, పలు శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపిటిసి తదితరులు పాల్గొన్నారు.
సాలూరు రూరల్: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సమావేశం బుధవారం ఎంపిడిఒ గొల్లపల్లి పార్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు వారి గ్రామాలలో ఉండే సమస్యలను సమావేశంలో అధికారులకు తెలియజేశారు. కారడవలస సర్పంచ్ జి.శంకర రావు మాట్లాడుతూ గ్రామస్తులు రేషన్ సరుకులు తీసుకునేందుకు దండిగం, జిల్లేడువలస వరకు సుమారు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారని ఇప్పుడు రోడ్డు సదుపాయం అందుబాటులోకి వస్తున్న సందర్భంగా తమ గ్రామం వరకు నిత్యావసర సరుకులు వాహనం ద్వారా తీసుకొచ్చి పంపిణీ చేయాలని కోరారు. కురుకుత్తి ఎంపిటిసి సుబ్బారావు మాట్లాడుతూ తమ పరిధిలో వుండే అంగన్వాడి సిబ్బంది రేషన్ కార్డులు లేక వారికి వచ్చే తక్కువ జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారని అటువంటి వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. తహశీల్దారు బాల మురళీ కృష్ణ మాట్లాడుతూ సభ్యులు అడిగిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి జి.రాములమ్మ, వైస్ ఎంపిపిలు రెడ్డి సురేష్, సువ్వాడ గుణవతి, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్‌ఒ శివకుమార్, ఎఎంసి చైర్‌పర్సన్ దండి అనంత కుమారి, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.