ప్రజాశక్తి-ఈపూరు : టిడిపి అధికారంలోకి రాగానే వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పల్నాడు జిల్లాలో యువగళం పాదయాత్ర మూడోరోజైన గురువారం వినుకొండ, ఈపూరు మండలాల్లో కొనసాగింది. పాదయాత్ర ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకు 2300 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొండ్రముట్ల వద్ద 2300 కిలోమీటర్ల మైలురాయికి చేరడం సంతోషంగా ఉందని లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా వరికపూడిశెల ప్రాజెక్టుకు హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అంది పల్నాడు ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. బొల్లాపల్లి మండలంలో ప్రజల సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. తొలుత సత్యనారాయణపురం గ్రామస్తులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గ్రామంలో శ్మశానవాటిక లేక అంత్యక్రియలు చెరువుల, పొలాల్లో చేయాల్సి వస్తోందని, గ్రామంలోని మురుగునీటి కాల్వలు లేవని, వర్షాకాలంలో దోమలబెడద తట్టుకోలేకపోతున్నామని వివరించారు. పొలాలకు వెళ్లేందుకు దారి లేక రైతులు, కూలీలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గ్రామంలో శుభకార్యాలు జరుపుకోవడానికి కమ్యూనిటీ హాలు నిర్మించాలన్నారు. లోకేష్ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. తరువాత కొచ్చర్ల గ్రామస్తులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా ఉందన్నారు. సురక్షిత నీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంక్, ఎస్సీలకు కమ్యూనిటీ హాలు నిర్మించాలని కోరారు. అసైన్డ్ భూములు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని పేదలకు అందించాలని అన్నారు. అంగలూరు గ్రామస్తులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు ఈనాం భూములు కావడంతో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. నిషేధిత జాబితా నుండి మా భూములను తొలగించి పట్టాలు ఇప్పించాలన్నారు. లోకేష్ స్పందిస్తూ ఈ సమస్య తనదృష్టిలో ఉందని, అధికారంలోకి వచ్చాక సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవ అనుభవదారులను గుర్తిస్తామని అన్నారు. అంగలూరు వద్ద అరటితోటవద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న అరటిగెలలను లోకేష్ పరిశీలించారు. రైతు శ్రీనివాసరావు తన కష్టాలను చెబుతూ జి-9 రకం అరటి మూడెకరాలు సాగుచేశాను, రూ.3 లక్షల పెట్టుబడి పెడితే ఎకరాకు రూ.20 వేల చొప్పున రాబడి వచ్చిందని చెప్పారు. టన్ను 30వేలు పలకాల్సిన పంటను కొనుగోలుదార్లు రాక రూ.3 వేలకు అమ్ముకున్నానన్నారు. మరో రెండెకరాల్లో జామతోట వేస్తే పురుగుపడి కాయ చెడిపోయిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి బీమా సొమ్ము అందడం లేదన్నారు. ఏటేటా నష్టాలతో వ్యసాయం చేయడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో టిడిపి పలనాడు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు,నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










