Nov 18,2023 19:47

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీవీ

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి తన అధికారాన్ని వైసిపికి తాకట్టు పెట్టారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయ నాగేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. శనివారం బీవీ తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి గెలుపొందిన నాటి నుంచి ఎమ్మిగనూరులో భూవివాదాలు పెరిగిపోయాయని తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడడంలో టిడిపి ఎప్పుడూ ముందుంటుందన్నారు. ప్రజలను పీడించి చెత్త పన్ను వసూలు చేయించడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మంచి చేయడంలో లేదని మండిపడ్డారు. మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి వైసిపి కండువా కప్పుకొని కౌన్సిలర్‌గా పోటీ చేస్తే బాగుంటుందని హితవు పలికారు. గతంలో ఎమ్మెల్యేగా చెన్నకేశవ రెడ్డి ఉన్నారని, ఎన్నడూ లేని భూవివాదాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. గతంలో మాచాని సోమప్ప కులమతాలకు అతీతంగా సుమారు 6.06 ఎకరాల్లో వైడబ్ల్యుసిఎస్‌ గ్రౌండ్‌ కేటాయిస్తే ఆ స్థలంలో షెడ్లు ఏర్పాటు చేయడం సిగ్గు చేటని తెలిపారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర అత్యున్నత నాయస్థానం కూడా తమ న్యాయమైన అభ్యర్థనను విని 3 నెలల్లో వైడబ్ల్యుసిఎస్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించాలని పేరొందని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ గంగి రెడ్డిని దీనిపై వివరణ కోరి షెడ్లను తొలగించాలని అడిగితే జాప్యం చేసి, మిలిటరీ కాలనీలో సుమారు 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థిర గృహాలను రోడ్‌ వైండింగ్‌ పేరుతో జెసిబిలతో కూల్చడానికి వెళ్లారని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డికి పేదలంటే, పేదల ఆస్తులంటే అంత చులకన, కోపం ఎందుకని నిలదీశారు. దయాసాగర్‌, కలీముల్లా, కొండయ్య చౌదరి, రంగస్వామి గౌడ్‌, మధుబాబు, మల్లికార్జున, కటారి రాజేంద్ర, బనవాసి అబ్రహాం, గురు రాజ్‌ దేశాయి, ఖాసీం వలీ, కృష్ణమ నాయుడు, బేతాళ బడే సాబ్‌, రామాంజనేయులు, రమేష్‌ నాయుడు పాల్గొన్నారు.