Sep 30,2023 22:01

ఓట్ల తొలగింపుపై ఆర్డీవోకు విన్నవిస్తున్న పరిటాలశ్రీరామ్‌

           ధర్మవరం టౌన్‌ : ధర్మవరంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసిపి నేతలు టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించేస్తున్నారని, దీనిని నియంత్రించకుంటే భవిష్యత్తులో సంబంధిత అధికారులు ఇబ్బందులు పడకతప్పదని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ తెలిపారు. ధర్మవరంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు అంశం మీద పరిటాల శ్రీరామ్‌ ఆర్డీవో కార్యాలయానికి శనివారం సాయంత్రం వెళ్లి ఎన్నికలు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్‌ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న బూత్‌లెవల్‌ అధికారులను స్థానిక ఎమ్మెల్యే తన ఇంటివద్దకు పిలుపించుకుని టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించమని ఒత్తిడి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో దాదాపు 16వేల ఓట్లు నకిలీవి ఉన్నాయని, తాము గతంలోనే ఫిర్యాదు చేశామని చెప్పారు. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. గత కొన్ని ఓట్ల పరిశీలన పేరుతో గత కొన్ని రోజులుగా కొంతమందికి నోటీసులు ఇస్తున్నారని, వాటిని పరిశీలిస్తే తాము ఫిర్యాదు చేసిన జాబితాలో వారికి ఎవరికీ నోటీసులు రాలేదన్నారు. కేవలం వైసీపీ నాయకులు చెప్పిన విధంగానే నోటీసులు ఇస్తున్నారన్నారు. గత జనవరిలో 8వేల మందికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఓట్లు తొలగించారన్నారు. ప్రస్తుతం బిఎల్‌ఒలను ఇంటి వద్దకు పిలిపించుకుని గుర్రం శ్రీనివాసులు అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే చెప్పినట్టుగా లేదా అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా బిఎల్‌ఎలు నడుచుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారన్నారు. ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా ఓట్ల సవరణ చేపట్టాలన్నారు.