ఎంఎల్‌సి చిక్కాల
ప్రజాశక్తి - కాకినాడరూరల్
ఎంఎల్ సిగా పదవీ విరమణ చేయనున్న తనును అధికార పార్టీ తరఫున మంత్రులు దాడిశెట్టి రాజా, సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, స్థానిక ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు సత్కరించడం రాజకీయాలలో మంచి సంప్రదా యమని ఎంఎల్‌సి చిక్కాల రామచంద్రరావు ఆనందం వ్యక్తం చేశారు. రమణయ్యపేట ఎపిఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంఎల్‌ఎ చిక్కాల రామచంద్రరావు ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్‌పి సమావేశంలో చైర్ పర్సన్, జడ్‌పిటిసి సభ్యులు కూడా తనను సత్కరించడం అభినందనీయమని అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు త్రికరణ శుద్ధిగా ప్రజలకు సేవ చేస్తానన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుల, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా మెలిగే ప్రజా సేవకుడు చిక్కాల రామచంద్రరావు అని అన్నారు. నియోజకవర్గంలో అడుగడుగునా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టడంతో తాళ్ళరేవు ఎంఎల్‌ఎగా ఐదుసార్లు, మంత్రిగా రెండుసార్లు సేవలు అందించారని అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఏదో చేయాలనే తపనతో పనిచేసిన నిరాడంబర రాజకీయ నేత చిక్కాల అని తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ సమకాలీన రాజకీయ నాయకులలో చిక్కాలది ఒక ప్రత్యేక స్థానమని అన్నారు. కార్యక్రమంలో రవిశంకర్ పట్నాయక్, చింతపల్లి సుబ్బారావు, ఓం నమశ్శివాయ, రేలంగి బాపిరాజు, డాక్టర్ శిరీష, అడబాల సత్యనారాయణ, పార్థసారథి, రాఘవరావు పాల్గొన్నారు.
ఎంఎల్‌సి చిక్కాలను సన్మానిస్తున్న అడబాల ట్రస్ట్ సభ్యులు










