Apr 06,2023 00:54

మండలంలో ప్రభుత్వ భూముల

ప్రజాశక్తి- గొలుగొండ: మండలంలో ప్రభుత్వ భూముల అయిన కొండా పోరంబోకు, గోర్జులను ఆక్రమించడానికి నర్సీపట్నంకు చెందిన అధికార పార్టీ నేతలు ప్రారంభించారు. అందుకోసమే ప్రత్యేకంగా ఆర్డిఓ కోర్టులో వివాదస్పదంగా ఉన్న భూమి కొనుగోలుకు ఆ నేతలు అడ్వాన్సులు కూడా చెల్లించారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
గొలుగొండ మండలం గొలుగొండ రెవెన్యూకు చెందిన 490 సర్వే నెంబరులో ఉన్న 3ఎకరాల 63 సెంట్లు భూమికి సంబంధించి వారసుల మధ్య వచ్చిన గొడవల కారణంగా వివాదాస్పదం కావడంతో గత మూడు సంవత్సరాలుగా నర్సీపట్నం ఆర్టీవో కోర్టులో ఉంది. ఈ భూమికి తూర్పు, పడమర, దక్షిణ దిశల్లో కొండపోరంబోకు, గోర్జు భూములు ఉన్నాయి. దీంతో నర్సీపట్నంకు చెందిన అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి వివాదాస్పద భూమిని కొనుగోలు చేసుకుంటే ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకొని వ్యాపారం చేసుకొని లక్షల రూపాయలు సొమ్ము చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ భూమి కొనుగోలుకు ప్రయత్నాలు చేశారు. అధికారంలోనే ఉన్నాం కదా అధికారులు మన మాటలు వింటారనే ధైర్యంతో ఈ భూమి కొనుగోలుకు ముందుకు వచ్చారు. వివాదాస్పద భూమికి ఆనుకుని తూర్పు వైపు 489-3 సర్వే నెంబరులో 9.43 ఎకరాల కొండ పోరంబోకు, దక్షిణ పడమరల వైపు 489-2 సర్వే నెంబర్లు 4.52 ఎకరాల ప్రభుత్వ భూమి( గోర్జు) లు ఉన్నాయి. దీంతో నర్సీపట్నంకు చెందిన ఇద్దరు అధికార పార్టీ నేతలు జనవరి నెలలో ఈ వివాదాస్పద భూమిని సుమారు కోటి రూపాయలకు కొనుగోలు చేసుకోవడానికి బేరసారాలు కుదిరి, 20 లక్షల రూపాయలు ఒక వర్గానికి చెందిన వారసులకు అడ్వాన్స్‌ చెల్లించారు. మంగళవారం వారు భూమిని చదును చేసే క్రమంలో ప్రభుత్వ భూములు కూడా కలుపుకొని వాహనాలతో భూమిని చదును చేయించారు. ఆర్డీవో కోర్టుకు ఫిర్యాదు చేసిన రెండో వర్గానికి చెందిన వారసులు భూమి చదును చేయడాన్ని గమనించి రెవిన్యూ, పోలీస్‌ వర్గాలకు ఫిర్యాదు చేశారు. దీంతో, అధికారులు వచ్చి పనులను నిలిపివేశారు. వివాదాస్పద భూమిని కొనుగోలు చేయడానికి ముఖ్య కారణం కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమిని చేజిక్కించు కోవచ్చుననే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల వశం కాకుండా కాపాడాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
యంత్రాలను విడిచిపెట్టిన అధికారులు:
వివాదాస్పద భూమిలో చదును చేసిన యంత్రాలను రెవెన్యూ, పోలీస్‌ అధికారులు విడిచి పెట్టడం వెనుక అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిడులు ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.ఆర్డిఓ కోర్టులో ఉన్న వివాదస్పద భూమి అని తెలిసి కూడా లెవెలింగ్‌ చేస్తున్న యంత్రాలను రెవెన్యూ అధికారులు, పోలీసులు విడిచిపెట్టడం విశేషం. దీని వెనుక అధికారి పార్టీ నాయకుల ఒత్తిడేనా లేక మరో కారణం ఏమైనా ఉందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.