ప్రజాశక్తి-అద్దంకి: అధికార పార్టీ నేతలు అడ్డూ అదుపూ లేకుండా సహజ వనరులను దోచుకుంటున్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామంలో అనుమతులు లేకుండా డ్రెజ్జర్ల సహాయంతో ఇసుకను తోడుతున్న నది పరివాహక ప్రాంతాన్ని తెలుగు దేశం పార్టీ నాయకులు, స్థానికులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నా రన్న ముందస్తు సమాచారంతో ఇసుకాసురులు పనులు నిలిపివేసి అందుబాటులో లేకుండాపోయారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అవగాహ న లేని ముఖ్యమంత్రి పాలనతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నా రని, అధికారం వచ్చిన నాటి నుంచి నేటి వరకు వైసిపి నాయకులు జేబులు నింపుకునే పనిలో నిమగమై ఉండటం వల్ల ప్రజలకు ఈ దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. వైసిపి నేతల కనుసన్నల్లోనే భారీ డ్రెజ్జర్లతో ఇసుక అక్రమ తవ్వకా లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకేనా జగన్‌రెడ్డిపై నమ్మకం ఉంచుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. గుండ్లకమ్మ నది పరీవాహక ప్రాంతంలో ఇసుకను తోడుతూ పెద్ద పెద్ద డంపర్లు ట్రక్కులతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని, పెద్దఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు జరిగా యని పేర్కొన్నారు. చిన్నపాటి లోయల్లా దర్శనమిస్తున్న ఇసుక గుంతలే ఇందుకు తిరుగులేని సాక్ష్యాలని అన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలను బూచిగా చూపెడుతూ మాయ మాటలు చెబుతున్నారని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కడుతున్న ఇళ్ళు ఎన్ని? కావాల్సిన ఇసుక ఎంత? ఇప్పటివరకు తోడిన ఇసుక ఎంత? అని అడిగితే సమాధానం చెప్పే నాథుడే లేడన్నారు. కొరిసపాడు ఎత్తిపోతల పథకం తమ్మవరం లిఫ్ట్ కాలువలను ఇసుక మాఫియా పూడ్చితే అధికారులు కిమ్మనకుండా ఉండటం ఏంటని ప్రశ్నించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోయి దాదాపు పది నెలలు కావస్తున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో గేట్లు అమర్చకపోవడం ఈ ప్రభుత్వం రైతులు, ప్రజల పట్ల ఆసక్తి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అధికార పార్టీ నేతలు ఇసుకను తరలించడం కోసమే ఒక పథకం ప్రకారం ప్రాజెక్టు గేట్లు దెబ్బతినేలా వ్యవహరించారా అన్న అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. గుండ్లక మ్మ ప్రాజెక్టు కింద దాదాపుగా లక్ష ఎకరాలకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు అందించడమే కాకుండా వేలాది మంది మత్స్యకారులు జీవనం సాగిస్తుండేవారన్నారు. వైసిపి ప్రభు త్వం మత్స్యకారుల జీవనోపాధిపై కోలుకోలేని దెబ్బకొట్టిం దని ఆయన అన్నారు. ఇసుకను తోడుతున్న విషయాన్ని స్థానిక గ్రామ ప్రజలు మీ దృష్టికి తీసుకువచ్చినా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రాజెక్టు అధికారిని ఎమ్మెల్యే ప్రశ్నించా రు. దివంగత యర్రం చిన్నపోలిరెడ్డి ఎత్తిపోతల జలాశయ కాలువను పూడ్చినవారిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను నిలదీశారు. ఇలాంటి చర్యల వలన ప్రాజెక్టు దెబ్బతినే ప్రమాదం ఉందని, వెంటనే వాహనాలను ఇక్కడ నుంచి తరలించేలా చర్యలు చేపట్టాలని, లేనిచో ప్రజలకు మద్దతుగా జాతీయ రహదారి దిగ్బంధం చేసేందుకు వెనుకాడబోమని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని హెచ్చరించారు.










