అధికార పార్టీ కుట్రతోనే తప్పుడు కేసులు
- కేసులకు భయపడేదే లేదు
- ఆళ్లగడ్డలో యువగళం విజయవంతం చేస్తాం
- టిడిపి నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ
మాజీ మంత్రి, తన సోదరి భూమా అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టడంలో అధికార వైసిపి కుట్ర ఉందని టిడిపి తాలూకా యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఆరోపించారు. గురువారం పట్టణంలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. గత 40 రోజులుగా పాదయాత్రలో భూమా అఖిల ప్రియ చంటి బిడ్డను వదిలి లోకేష్ వెంట నడుస్తున్నారని, ఇన్ని రోజులుగా జరగని గొడవ ఆళ్లగడ్డ పర్యటన మరో మూడు రోజుల సమయం ఉండగా జరగడం అనుమానాలకు తావిస్తుందన్నారు. అక్క అఖిలప్రియ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలన్న దురుద్దేశంతో పక్కా ప్రణాళికతో వ్యూహం పన్ని గొడవలు సృష్టించారన్నారు. జరిగిన సంఘటన అందరికీ తెలిసిందేనన్నారు. తన అక్కపై తప్పుడు కేసులు నమోదు చేసి చంటిపిల్ల తల్లి అని కూడా చూడకుండా జైలుకు పంపించారన్నారు. ఏవి సుబ్బారెడ్డి అక్క చున్ని పట్టుకొని అవమానకరంగా ప్రవర్తించారన్నారు. అలా చేసినందుకే కార్యకర్తలు దాడికి దిగారన్నారు. వెంటనే అక్క స్పందించి కార్యకర్తలకు సర్ది చెప్పారన్నారు. కూతురు లాంటి అఖిలప్రియ పట్ల ఏవి సుబ్బారెడ్డి అభ్యంతరకరంగా వ్యవహరించారన్నారు. ఈ గొడవ టిడిపి నేతల మధ్య జరిగింది కాదని ఇందులో కచ్చితంగా అధికార పార్టీ వారి ప్రమేయం ఉందన్నారు. ఆళ్లగడ్డలో పాదయాత్రను దెబ్బ తీసేందుకు వారు కుట్ర పన్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఆళ్లగడ్డలో పాదయాత్రను విజయవంతం చేస్తామన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అక్క అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డిపై కేసు పెట్టారని, ఆ కేసు ఏమైందని ప్రశ్నించారు. నంద్యాల ఘటనలో బాధితులమైన తమపైనే కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం అన్యాయమన్నారు. ఈ పాదయాత్రతో భూమా అఖిలప్రియ బలం ఏమిటో రాష్ట్రం అంతటా తెలుస్తుందన్నారు. నంద్యాల ఘటనపై విచారణ చేయనున్న టిడిపి క్రమశిక్షణ కమిటీ బాధితురాలైన తన అక్కకు న్యాయం చేస్తుందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈనెల 21 నుండి యువగళం పాదయాత్ర మొదలవుతుందన్నారు. ఈ యాత్రను టిడిపి నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.










