ప్రజాశక్తి-హిందూపురం : స్వాతంత్య్ర దినోత్సవం రోజునే హిందూపురం పట్టణ ప్రథమ పౌరురాలికి అవమానం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవ రోజున మున్సిపల్ కార్యయలంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసే అధికారం ఉన్న చైర్‌పర్సన్‌ను పక్కన పెట్టి, ఎలాంటి అధికారం లేని పార్టీ సమన్వయ కర్తను ముందుకు తెచ్చి జెండాను ఎగుర వేయించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణంలోనే 77వ స్వాతంత్య్ర దినోత్సవం రోజునే అధికారులు అధికార పార్టీ నేతలకు తలొగ్గి రాజ్యంగ ఉల్లంఘన చేశారు. మున్సిపల్ అధికారులు తమ స్వామి భక్తిని చాటుకోవడం కోసం మున్సిపల్ కార్యలయాన్ని వైసిపి కార్యాలయంగా మార్చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ జెండా ఎగర వేయాడానికి కార్యాలయానికి వచ్చి సుమారు గంటకు పైగా వేచి చూశారు. అధికారులు అప్పటి రాక పోవడంతో ఫోన్ చేసి రావాలని పిలిచినా ఎవరు పలక పోగ, కనీసం ఒక చైర్‌పర్సన్‌కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. దీంతో అమె కార్యాలయం నుంచి అవమాన భారంతో వెళ్లి పోయారు. చైర్‌పర్సన్ వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న అధికారులు కార్యాలయానికి చేరుకున్నారు. వెనువెంటనే జెండా ఆవిష్కరణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అధికార పార్టీ ఇన్‌చార్జ్ దీపిక తన వర్గ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కమిషనర్ చైర్‌పర్సన్‌కు సమాచారం ఇచ్చి రావాలని పిలవడానికి ప్రయత్నం చేశారు. అయితే కొంత మంది కౌన్సిలర్లు కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు చేసేది ఏమి లేకా చేతులెత్తేశారు. వైస్ చైర్మన్‌తో సహా కొంత మంది కౌన్సిలర్లు ఇన్‌చార్జి దీపిక తో జెండాను ఎగర వేయించారు. ఈ విషయం బయటకు రావాడంతో ఒక బిసి మహిళ ఇన్‌చార్జ్‌గా ఉన్నా నియోజక వర్గంలోనే మరోక బిసి మహిళకు గుర్తింపు దక్కడం లేదని పుర ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్‌ను అడిగితే ఉదయం 8.30 గంటలకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశామని, చైర్‌పర్సన్ ముందుగా వచ్చి తమ బంధువుల్లో ఎవరికో బాగాలేదని వెళ్లి పోయారని అన్నారు. ఈ విషయంపై చైర్‌పర్సన్ ఇంద్రజ మాట్లాడుతు తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబందించి ముందుగానే కార్యాలయానికి వస్తున్నామన్నారు. ప్రతి ఏడాది తరహాలోనే ఈ ఏడాది కార్యాలయానికి వచ్చానని చెప్పారు. మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఇతర అధికారులకు ఫోన్ చేస్తే ఎవరు స్పందించలేదన్నారు. దీంతో ఇతర ప్రాంతాల్లో జరిగే వేడుకల్లో పాల్గొనాల్సి ఉండడంతో వెళ్లి పొయానన్నారు. అధికార పార్టీలో ముదిరిన వర్గ పోరు స్వాతంత్య్రం రోజున మరోసారి బహిర్గమైంది.










