May 04,2023 00:28

సమావేశంలో పాల్గొన్న గిరిజన సంఘం, ఆదివాసీ సంక్షేమ పరిషత్తు నాయకులు

ప్రజాశక్తి-మారేడుమిల్లి
అధికార పార్టీ నాయకుల బెదిరింపులు ఆపాలని గిరిజన సంఘం, ఆదివాసీ సంక్షేమ పరిషత్తు నాయకులు డిమాండ్‌ చేశారు. మండలం కేంద్రంలో బుధవారం అధికార పార్టీ వేధింపులకు వ్యతిరేకంగా ఆదివాసీ పోరాట సంఘీభావ సభ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లె రెడ్డి అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఓట్ల కోసం గిరిజనులకు మోసం చేస్తూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. ఒక వైపు బోయ వాల్మీకులను ఎస్టి జాబితాలో చేర్చడాన్ని సమర్థిస్తూనే, మళ్ళీ వారే ఆదివాసీల కోసం నిలబడతామని ప్రకటనలు చేయడం దారుణమన్నారు. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం చేసిన తీర్మానానికి వ్యతిరేకిస్తున్న గిరిజనులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని చూస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యమ కారులపై దౌర్జన్యం, బెదిరింపులు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు కురసం ఫకీరు దొర, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ, గిరిజన సంఘం మండల అధ్యక్షులు ఆవుల ధర్మారెడ్డి, జెఎసి నాయకులు కత్తుల రమణరెడ్డి, రేవుల జానకిరెడ్డి, సర్పంచ్‌ ఈతపల్లి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.