Apr 19,2023 16:18

బాధిత రైతుల పొలాలను పరిశీలిస్తున్న నాయకులు

అధికార పార్టీ అనునాయుల ఆస్తులను కాపాడేందుకే

చిన్న, సన్న కారు రైతుల భూములు లాక్కుంటున్నారు
నంద్యాల టు జమ్మలమడుగు జాతీయ రహదారి నిర్మాణం కోసం పేద మధ్య తరగతి రైతుల భూములు లాక్కోవద్దు.  .
గ్రామ సభ ద్వారా రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రత్యామ్నాయ భూములో  రహదారి నిర్మించండి
ఏపీ రైతు సంఘం, సిపిఎం డిమాండ్.
ప్రజాశక్తి, నంద్యాల కలెక్టరేట్

       నంద్యాల నుండి జమ్మలమడుగు వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణ గజట్ నోటిఫికేషన్ ప్రకారం కానాల, రైతు నగరం గ్రామాల్లోని పేద మధ్యతరగతి రైతుల భూములు ఎక్కువగా కోల్పోయే విధంగా  ఉన్నదని  కేవలం కొంతమంది ధనవంతులు, అధికార పార్టీ అనునాయుల ఆస్తులను కాపాడేందుకు కోసం, కానాల గ్రామ ప్రజలు సూచించిన విధంగా కాకుండా ప్రభుత్వం భూ సేకరణ చేస్తుందని  సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ , ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ , జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు లు ఆరోపించారు. బుధవారం సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు కానాల, రైతు నగరం గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులను సందర్శించి వారి పొలాల వద్దకెళ్లి, రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు తమ గోడును నాయకులకు విన్నవించుకున్నారు. తాము కేవలం ఎకరా లేదా రెండు ఎకరాలు భూమి కలిగి ఉన్న పేద రైతులమని, తమకు జీవనాధారంగా ఉన్న ఆ కొంత భూమిని ప్రభుత్వ అధికారులు మాకు ఏ మాత్రం చెప్పకుండా, మా అభిప్రాయాలను తెలుసుకోకుండా, గ్రామ సభ జరపకుండా  మా భూముల్లో రహదారి కోసం మార్కింగ్ వేస్తున్నారన్నా రు. మొదట్లో మా గ్రామంలో రహదారి కోసం చేసిన ప్లాన్ ప్రకారం కాకుండా మరో ప్లాన్ ప్రకారం గెజిట్ ప్రకటించారని, గజిట్ పై తమ అభ్యంతరాలను భూ సేకరణ అధికారులకు అనేకమార్లు విన్నవించుకున్న ఏ మాత్రం పట్టించుకోకుండా నేడు మార్కింగ్ ఇస్తున్నారని ఆవేదన చెందారు.ఈ చర్య వల్ల ఉపాధి కోల్పోయి  ఆత్మహత్య చేసుకునే  పరిస్థితి ఏర్పడుతుందని రైతులు నాయకుల ముందు తమ ఆవేదనను వెల్లడించారు. ఈ సందర్భంగా  జిల్లా , సిపిఎం జిల్లా కార్యదర్శి టి. రమేష్ కుమార్,రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ. రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి టి. రామచంద్రుడు లు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్  వెంటనే జోక్యం చేసుకొని కానాల గ్రామంలో గ్రామ సభ నిర్వహించి, గ్రామ రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, పేద మధ్యతరగతి రైతులకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గంలో భూ సేకరణ చేపట్టాలని   కోరారు. ప్రజాభిప్రాయం మేరకు జరగని పక్షంలో గ్రామాల రైతులతో కలిసి మార్కింగ్ పనులను అడ్డుకుంటామని పేర్కొన్నారు.అధికార పార్టీ నాయకుల, ప్రజా ప్రతినిధుల, రియల్ ఎస్టేట్ ట్ వ్యాపారస్తుల ఆస్తులు కాపాడేందుకు కోసం పేదవాళ్ళ భూములు రహదారుల కోసం లాక్కొని వారి కడుపులు కొట్టొద్దని నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అందుకు అధికార యంత్రాంగం సహకరించవద్దని ఉన్నతాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హుస్సేన్ వలి, యూసఫ్ తోపాటు గ్రామ రైతులు మురళీకృష్ణ శర్మ, శంకర్రావు, వెంకటరామిరెడ్డి, గంగాధర్ రెడ్డి, టి వెంకటేశ్వర్లు, రామ చిన్నమ్మ మరియు భూములు కోల్పోయే రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.