
ప్రజాశక్తి - నందిగామ : కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నందిగామ ఆర్‌డిఒ రవీంద్రరావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గోపి నాయక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంవత్సరం ప్రారంభం నుండి తల్లిదండ్రులకు ఫీజులవాత విద్యార్థులకు పుస్తకాల మోత తప్పడం లేదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకంటే ఏ మాత్రం ఎక్కువ వసూలు చేయరాదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ పదేపదే హెచ్చరిస్తున్నా కొన్ని సంస్థలకు నోటీసులు జారీ చేస్తున్నా ఇవేమీ తమకు పట్టనట్టుగా కొన్ని యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. 2019 నుండి పెండింగ్‌లో ఉన్న కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్‌లో నాడు - నేడు పనులు ప్రారంభించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఇఒ, డివైఇఒ పోస్టులు భర్తీ చేయాలని, ఖాళీగా వర్కర్ పోస్ట్లు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హసేను, కర్రి వెంకటేశ్వరరావు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.