
ప్రజాశక్తి - భామిని : ఒడిశా నుంచి బత్తిలి మీదుగా బత్తిలి -అలికం రోడ్డు వెంబడి ఆంధ్రాలోని విజయనగరం, విశాఖపట్నం వైపుగా అధిక లోడ్‌తో ఇసుక లారీలు రాత్రులు వేగవంతంగా దుమ్ము దూలితో ప్రయాణిస్తుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ఒడిశాలోని రాయగడ జిల్లా, పద్మపూర్ బ్లాక్ లోని గుమడ వంశదార నది వద్ద బిసంకోటక్ శాండ్ బెడ్ నుంచి ప్రతి రోజు రాత్రులు అధిక సంఖ్యలో ఇసుకు లారీలు 40 టన్నులు లోడ్‌తో బత్తిలి -అలికాం రోడ్డు మీదుగా అతివేగంగా ప్రయాణిస్తున్నాయి. ఆంధ్రా కంటే ఒడిశాలో ఇసుక సంబంధిత నిబంధనలు సరళంగా ఉండడం, ఇసుక రేటు తక్కువగా ఉండడం, డబ్బులు చెల్లించే దాని కన్నా అధికంగా ఇసుక లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండటం, ఆంధ్రాలో అంత ఇసుక వేసుకునే వెసులు బాటు లేకపోవటంతో ఒడిశా నుంచి ఇసుక రవాణాకు మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి ఒడిశా నుండి వచ్చే ఇసుక లారీల బిల్లులు చూస్తే 30 టన్నులకే వే బిల్లు, అమౌంట్ రిసీట్ ఉంటుంది. కానీ వాస్తవానికి ఒక లారీ 40 టన్నులతో నిబంధనలకు విరుద్దంగా ఆంధ్రాలోకి వస్తాయి. బత్తిలి నుండి కొత్తూరు మధ్య బత్తిలి -అలికాం ప్రధాన రహదారి రోడ్డు గోతుల మయంగా, కూలిపోయే వంతెనలతో ఉన్న ఈ రోడ్డుపై 40 టన్నులు ఇసుక లారీలు అధిక సంఖ్యలో వస్తుండడంతో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉందని, రోడ్డు, వంతెనలను పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయకుండా గాలికొదిలేసిన అధికారులు భవిష్యత్తులో ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఒడిశా నుండి అధిక లోడ్‌తో వస్తున్న ఇసుక లారీతో ప్రమాద పొంచి వుందని సూచించారు. రోడ్డు, వంతెనలు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే వరకు అధిక లోడ్‌తో వస్తున్న వాహనాలను అధికారులు నిలిపివేయాలని పలువురు కోరుతున్నారు.