Jul 28,2023 22:19

సమావేశంలో మాట్లాడుతున్న జెసి చేతన్‌

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌ : అధిక దిగుబడి, అధిక లాభాలు వచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ టి ఎస్‌ చేతన్‌, అగ్రి బోర్డు జిల్లా ఛైర్మన్‌ ఆవుటాల రమణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించగా జెసి, అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌తో పాటు అనంతపురం జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్‌ లిఖిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఈ క్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియ పక్కాగా చేపట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అగ్రికల్చర్‌, సిరికల్చర్‌, హార్టికల్చర్‌పై వ్యవసాయ అధికారులు ప్రచారం నిర్వహించాలన్నారు. రైతులకు డ్రిప్‌ పరికరాలు త్వరగా అందించాలన్నారు. పాడి సంవర్ధక శాఖ పథకాలకు సంబంధించి కరపత్రాలు ప్రదర్శించాలన్నారు. జగనన్న పాలు వెల్లువ కింద అందిస్తున్న ధరలను పాల సేకరణ కేంద్రాల లో ప్రదర్శించాలన్నారు. ప్రత్యామ్నాయ రాగి సాగును మరింత పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రమణారెడ్డి మాట్లాడుతూ సాంకేతికతపై రైతులకు శిక్షణ, అవసరమైన సలహాలు ఇవ్వాలన్నారు. పొలంబడి, జాతీయ ఆహార భద్రత మిషన్‌ క్లస్టర్‌ డెమోలపై నిపుణులతో శిక్షణ ఇప్పించాలన్నారు. సిరికల్చర్‌ సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలన్నారు. ప్రకతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని, మామిడి పంటకు సంబంధించి ఆ శాఖ అసిస్టెంట్లు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 31 క్లస్టర్లలో రైతులకు శిక్షణ ఇస్తున్నారని, వాటి సంఖ్యను పెంచాలన్నారు. పురుగుల మందులను అందుబాటులో ఉంచాలని, ఎరువులు మందుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు తరచూ తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో వ్యవసాయ జిల్లా అధికారి సుబ్బారావు, పశుసంవర్ధక శాఖ అధికారి శుభదాస్‌, సిరికల్చర్‌ జెడి పద్మమ్మ, మార్కెటింగ్‌ శాఖ అధికారి నరసింహమూర్తి, ఎపిఎం ఎఐసిపిడి సుదర్శన్‌, డ్వామా పిడి రామాంజనేయులు, విద్యుత్‌ శాఖ డిఈఈ మోసెస్‌, ఎపి సీడ్స్‌ డిఎం ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.