- సిపిఎం ధర్నాలతో దద్దరిల్లిన తహశీల్దారు కార్యాలయాలు
- తరలి వచ్చిన కార్మికులు, ప్రజలు, పార్టీ శ్రేణులు
- విజయవాడలో వినూత్న ప్రదర్శనలు
ప్రజాశక్తి - విజయవాడ : అధిక ధరలు అదుపు చేయాలని, నిరుద్యోగాన్ని అరికట్టాలని, విద్యుత్ భారాలు రద్దు చేయాలని దేశవ్యాప్త పిలుపు మేరకు సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన 'సమరభేరి'లో భాగంగా సోమవారం ఎన్‌టిఆర్, కృష్ణాజిల్లాల్లో ధర్నాలు నిర్వహించారు. ఆయా జిల్లాల్లోని తహశీల్దారు కార్యాలయాలు, ప్రధాన సెంటర్లు సిపిఎం ధర్నాలతో దద్దరిల్లాయి. ఆటో, ముఠా, భవన నిర్మాణ కార్మికులు, హాకర్లు తదితర రంగాలకు చెందిన కార్మికులు, పార్టీ శ్రేణులతోపాటు వందలాదిగా తరలి వచ్చి ప్రజలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, రూ.400లకే గ్యాస్ ఇవ్వాలని, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కందిపప్పు, నూనె, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని ఆందోళనకారులు చేసిన నినాదాలు మారుమోగాయి. అనంతరం తహశీల్దారు కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు.
విజయవాడలో ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాలో ప్రజలపై పడుతున్న భారాలను వినూత్న రీతిలో ప్రదర్శించారు. విచిత్ర వేషధారణలు, డిమాండ్లతో కూడిన నినాదాలు, ధరల తీవ్రత, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఏవిధంగా నలిగిపోతున్నారో తెలిపేవిధంగా కళ్లకు కట్టినట్లుగా చూపారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలని, రూ.400లకే గ్యాస్ ఇవ్వాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని, గిరిజన యువతకు ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆయా వస్తువుల నమూనాలను ప్రదర్శించారు. అలాగే నిరుద్యోగులు ఖాళీప్లేట్లను ప్రదర్శిస్తూ బిచ్చమెత్తుకుంటున్నట్లు ప్రదర్శించారు. నిరుద్యోగ భూతాన్నీ ప్రదర్శించారు. ఏ విధంగా విద్యుల్ బిల్లుల భారంగా ఉన్నాయో విధంగా ఒక యువకుడి తలచుట్టూ చిన్నచిన్న బల్పులతో కూడిన వైర్ చుట్టి దానికి విద్యుత్ బిల్లులు చూపిస్తూ చేసిన ప్రదర్శన ఆలోచింప చేసింది. అలాగే విద్యుత్ ప్రైవేటీకరణ, 2014లో రూ.409 ఉన్న గ్యాస్ ధర, నేడు రూ.1155కు పెరిగిన వైనాన్ని తెలిపే విధంగా చేసిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు మోపుతున్న భారాలను తెలిపే విధంగా చేపట్టన ఈ వినూత్న ప్రదర్శనలను ప్రజలను ఆలోచింప చేశాయి. అనంతరం గాంధీనగర్ తహశీల్ధార్ కార్యాలయం (సెంట్రల్ మండలం) డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసమూర్తికి నేతలు వినతిపత్రం అందజేశారు. ఆ వినతిపత్రాన్ని కలెక్టర్‌కు పంపుతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌తోపాటు నాయకులు కె.శ్రీదేవి, బి.రమణరావు, బోయి సత్యబాబు, కె దుర్గారావు, పి కృష్ణ, ఎ. వెంకటేశ్వరరావు, టి ప్రవీణ్, ఎం సీతారాములు, వై సుబ్బారావు, చింతల శ్రీను, ఝాన్సీ, ఇవి నారాయణ, బి. చిన్నారావు, కె సరోజ తదితరులు పాల్గొన్నారు.
అలాగే కృష్ణాజిల్లా గన్నవరంలో జరిగిన ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, పెనమలూరు మండలం తాడిగడపలో జరిగిన కార్యక్రమాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.రఘు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైన కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ధరలు పెంపు, జిఎస్‌టి తదితర వివిధ రకాలుగా లక్షల కోట్ల మేర ప్రజలపై మోడీ ప్రభుత్వం భారాలు మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ దిగ్గజాలకు రాయితీలు, లాభాల రూపంలో దేశ సంపదను కట్టబెట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. దళారుల లాగా కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం చేస్తుందన్నారు. ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు రక్షా బంధన్, చంద్రయాన్-3, జి-20 ఇలా రకరకాలుగా ప్రధాని మోడీ ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. మోడీ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందన్నారు. స్మార్ట్ మీటర్లు, చెత్తపన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్ను, ఆస్తి పన్ను ఇలా అనేక రూపాల్లో పన్నులను విధించారని ఆందోళన వ్యక్తం చేశారు.










