* లైసెన్స్‌ల రద్దుకూ వెనకాడం
* వ్యవసాయ అధికారుల హెచ్చరిక
* ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
* 'ప్రజాశక్తి' కథనానికి స్పందన
ప్రజాశక్తి - బూర్జ, వజ్రపుకొత్తూరు: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయశాఖ అధికారులు ఎరువుల దుకాణాల యజమానులను హెచ్చరించారు. ప్రజాశక్తిలో ఈనెల 25వ తేదీన 'మమ్మల్ని అడిగేదెవరు?' శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పలు మండలాల్లో శనివారం ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. వ్యవసాయశాఖ జెడి ఆదేశాల మేరకు తలోవైపు పరుగులు తీసి తనిఖీలను ముమ్మరం చేశారు. శ్రీకాకుళం, కొత్తూరు, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో పర్యటించి పలు ఎరువుల దుకాణాలను తనిఖీలు చేపట్టారు. శ్రీకాకుళం, కొత్తూరు వ్యవసాయ శాఖ ఎడిలు రజని, రాజగోపాలరావు కొల్లివలసలో ఎరువు దుకాణాలను తనిఖీ చేశారు. ఎరువుల దుకాణదారుల వ్యవహారంపై రైతుల నుంచి వివరాలు సేకరించారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కన్నా ఎక్కువ ధరలకు ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఎరువుల దుకాణాదారులపై రైతుల నుంచి ఫిర్యాదు వస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. వీరితోపాటు మండల వ్యవసాయ శాఖ అధికారి వి.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరులో...
వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు కె.రవీంద్రభారతి వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో పలు ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. శ్రీలక్ష్మి గణపతి ఏజెన్సీ, సాయిరాం ఏజెన్సీలో ఎరువుల రికార్డులను పరిశీలించారు. ఎరువులు కొనే ముందు బస్తాలను తూకం వేసి అనంతరం డీలర్ నుంచి బిల్లును పొందాలని రైతులకు సూచించారు. స్టాక్ బుక్, ఈపాస్ గోడౌన్‌లో నిల్వ లెక్క సరిగా ఉండాలన్నారు. డీలర్లు రైతులకు చేతితో రాసిన బిల్లు మాత్రమే ఇవ్వాలని, కంప్యూటర్ బిల్లులను వ్యవసాయ శాఖ అనుమతి లేకుండా ఇస్తే నేరంగా పరిగణిస్తామన్నారు. ధరల పట్టిక ఏర్పాటు చేసి ఎంఆర్‌పి రేట్లు అమలు చేయాలని సూచించారు. తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి కిరణ్ వాణి, ఎఇఒలు ఉదరు కుమార్, జ్యోత్స్న పాల్గొన్నారు.










