Jul 20,2023 19:10

ప్రజాశక్తి - భీమడోలు
        నాణ్యమైన, అత్యధిక దిగుబడుల సాధనకు రైతులు వ్యవసాయ అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని వ్యవసాయ శాఖ భీమడోలు సహాయ సంచాలకులు పి.ఉషా రాజకుమారి కోరారు. భీమడోలు కేంద్రంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ మేలైన వ్యవసాయ యాజమాన్య పద్ధతుల పొలంబడి క్షేత్రం వద్ద గురువారం పొలంబడిని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భీమడోలు సహాయ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ రైతులకు కలుపు యాజమాన్యం, వరిసాగులో మెలకువల గురించి వివరించారన్నారు. ఏలూరుకు చెందిన రైతు శిక్షణాకేంద్రం సహాయ సంచాలకులు శ్రీదేవి మాట్లాడుతూ సాగులో ఎరువుల ఖర్చు తగ్గించుకునేందుకు జీవామృతాన్ని వాడుకోవాలని సూచించారు. దీనివల్ల సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి వ్యవసాయ క్షేత్రంలో నేల గుళ్లగా మారుతుందన్నారు. భూసారం పెంపుకు అవసరమైన సహాయ సహకారాలు అందుతాయన్నారు. అనంతరం జీవామృతం తయారీ, దాని వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఖర్చు రహిత సహజ వ్యవసాయం విభాగం సిబ్బంది, భీమడోలు వ్యవసాయ అధికారి ఎస్‌పి వి.ఉషారాణి, వ్యవసాయ శాఖ గ్రామస్థాయి సహాయకులు పాల్గొన్నారు.