రాయచోటి : జిల్లా లో రైతులందరికీ అందుబాటులో ఉండి ఖరీఫ్ సాగులో అధిక దిగుబడి కల్పించడమే తమ లక్ష్మమని జిల్లా వ్యవసాయ అధికారి బి . చంద్రనాయక్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో రైతులకు వ్యవసాయం ద్వారా పంటలు ఎలా పండించాలో, అధిక దిగుబడికి ఎయే పంటలు వేయాలో, పంట రుణాలు, ఖరీఫ్‌లో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ప్రజాశక్తికి ఇచ్చిన ముఖా ముఖిలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లాలో వ్యవసాయ శాఖలో ఏడీలు , ఏవోల వివరాలు తెలపండి ?
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఏడు డివిజన్లున్నాయి. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రైల్వేకోడూరు, మదనపల్లె, వాల్మీకిపురం, పీలేరు డివిజన్లలో ఏడీలున్నారు. జిల్లాలో 30 మండ లాల్లో ఒకరు చొప్పున ఏవోలు ఉన్నారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు గ్రామ రైతు భరోసా కేంద్రంలో 400 మంది ఉన్నారు.
జిల్లాలో సాధారణ సాగు, ప్రస్తుత సాగు విస్తీర్ణం ఎంత ?
జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం 82,589 హెక్టార్లు రైతులు సాగు చేయాల్సింది. ఇప్పటివరకు 2,200 ఎక్టర్లలో సాగు చేస్తున్నారు.
ఖరీఫ్ సాగుకు రైతులను ఏవిధంగా సన్నద్ధం చేస్తున్నారు?
ప్రస్తుత ఖరీఫ్‌కు అన్నిరకాల విత్తనాలను అందుబాటులో ఉంచాం. రైతుల అవసరాలకు తగ్గట్టుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతు శిక్షణ కేంద్రం, కషి విజ్ఞాన కేంద్రం కలికిరి వారు ఖరీఫ్ సాగుకు రైతులకి మండల స్థాయిలో, ఆర్‌బికె స్థాయిలో రైతులకు శిక్షణ ఇచ్చి ఖరీఫ్ సాగుకు సన్నద్ధం చేస్తున్నాం.
రైతులకు ఎరువులు, విత్తనాలు ఏమేరకు పంపిణీచేస్తున్నారు ?
జిల్లాలో ఇప్పటివరకు 37 వేల క్వింటాళ్ల కె 6, 14,500 నారాయణి విత్తనాలు, 11,00 క్వింటాళ్ల జనము, 11,00 క్వింటాళ్ల జీలుగా విత్తనాలు పంపిణీ చేశాం. ఇప్పటివరకు 2,600 టన్నుల అన్ని రకాల ఎరువులను రైతు భరోసా కేంద్రాలలో రైతుల కోసం అందుబాటులో ఉంచాం.
ఖరీఫ్ పంటల కార్యాచరణ ప్రణాళిక ఏమిటి?
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 82,589 ఎక్టర్లలో సాగు చేసేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. అందులో 47,885 హెక్టర్లు , వరి జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు తదితర తణ ధాన్యాలు సాగు చేసేందుకు సిద్ధం చేస్తున్నాం. ఖరీఫ్ పంటల కార్యాచరణలో భాగంగా జిల్లాలో 45 పొలంబడులు ఏర్పాటు చేశారు. రెండు జిపిఎ పొలం బడులు నిర్వహించాం. గ్రామ విత్తన పథకం కార్యక్రమాన్ని సుండుపల్లి మండలంలో సజ్జ పంటపైన అమలు చేయడం జరుగుతుంది. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంలో భాగంగా 2 వేల హెక్టార్లు ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.
రైతులకు ఎరువుల వాడకం పై ఎలాంటి అవగాహన కల్పించారు?
ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమాలను ఆర్‌బికె, మండల స్థాయిల్లో రైతు శిక్షణా కేంద్రం , కషి విజ్ఞాన కేంద్రం వారు శిక్షణ ఇస్తున్నారు. అలాగే గుంటూరులోని ఆర్‌బికె ఛానల్ వారు ప్రతి గ్రామంలో ఉండే డిజిటల్ టీవీల ద్వారా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అధిక మోతాదులో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామ, మండలస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎరువుల వాడకంపై తగిన సూచనలు చేస్తున్నారు.










