ప్రజాశక్తి-బాపట్ల: జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కాన్ సెంటర్లు రోగులకు అందించే వైద్య సేవలపై అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ విజయమ్మ హెచ్చరించారు. బుధవారం బాపట్లలో ప్రైవేటు వైద్యశాలలు స్కాన్ సెంటర్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సమీకత వ్యాధుల నిఘా కార్యక్ర మం (ఇంటి గ్రేటేడ్ డిసీజ్ సర్వెలేన్స్ ప్రోగ్రామ్ ఐడిఎస్‌పి)లో సమీకృత ఆరోగ్య సమాచార వేదిక ఇంటి గ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మే షన్ సిస్టమ్ - ఐ హెచ్‌ఐపి ద్వారా నమోదు చేసే విధానాన్ని ఆమె పరిశీలించారు. ఐహెచ్‌ఐపి వ్యాధులు ప్రతిరోజూ ఆన్‌లైన్ లో పొందుపరచాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్, ల్యాబ్‌లు పరీక్షలు నిర్వహించి సంక్రమిత వ్యాధులపై విధిగా అందుకు సంబంధించిన పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు రోగులకు అందించే చికిత్స, సేవలకు వసూలు చేసే ఛార్జీల వివరాలతో కూడిన ప్రదర్శన బోర్డులు అందరికీ కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తనిఖీల్లో జిల్లా డేటా ఎంట్రీ ఆపరేటర్ లక్ష్మణ్, హెచ్‌ఈ లక్ష్మీ నారాయణమ్మ, డిపిహెచ్‌ఎన్‌ఓ పద్మావతి పాల్గొన్నారు.










