
ప్రజాశక్తి-అచ్యుతాపురం
కసింకోట మండల నుంచి అధిక బరువుతో గ్రావెల్ లోడుతో వస్తున్న ఐదు లారీలను శుక్రవారం ఉదయం 5.30 గంటలకు పెదపాడు గ్రామం వద్ద ఆ గ్రామానికి చెందిన రైతులు, జెడ్పిటిసి మాజీ సభ్యుడు జనపరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యాన అడ్డుకున్నారు. అధిక బరువుతో వచ్చే బెంజ్ లారీలను మోసే శక్తి తమ గ్రామానికి చెందిన బ్రిడ్జికి లేదని, ఇలాగే లారీలు ప్రయాణిస్తే నేడే రేపో బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి వస్తుందని వారు పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో కొన్ని రోజులుగా అధిక బరువుతో కూడిన బెంజ్ లారీల్లో శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిపై నుంచి గ్రావెల్ తరలిస్తున్నారని, లారీ డ్రైవర్లకు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జిపై నుంచి పొలాల నుండి తమ పంట పలసాయాన్ని తెచ్చుకుంటామని, పశువులు, పంట పొలాలకు గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు.
ఈ సమయంలో వేయింగ్ సీట్లు చూపించాలని జెడ్పిటిసి మాజీ సభ్యుడు శ్రీనివాసరావు అడగ్గా తమ వద్ద ఎటువంటి రికార్డులు లేవని డ్రైవర్లు బదులిచ్చారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న బెంజ్ లారీలపై శ్రీనివాసరావు గ్రామ రెవెన్యూ అధికారికి, మండల తహశీల్దారకు ఫిర్యాదు చేశారు. అయితే ఉదయం 8.30 గంటలల సమయంలో ఆన్లైన్లో 16వ తేదీన నమోదు చేసి ఆ ట్రిప్ సీట్లను చూపించి అక్రమంగా గ్రావెల్ తరలించేశారు. ఉదయం 5.30 గంటలకు లారీలు పట్టుకుంటే 8.30కు ట్రిప్షీట్లు ఆన్లైన్లో చేయడంలో అధికారులు అతుత్సాహం ఏమిటని శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు. దోచుకోవడమే ధ్యేయంగా వైసిపి నాయకులు పనిచేస్తున్నారని, వారు చేసే ఆక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని శ్రీనివాసరావు ఆరోపించారు.