పొలోమని లగెత్తుకుపోయిందామె
ఆరిందాలంతా తలా
ఓ అడుగు ఎంచక్కా ధారపోశారు
కొప్పులు ముడేసి
కొంగులు ఎగ్గట్టి
తలా ఓ దిక్కు
నుంచీ వచ్చిన
ఆడమ్మలంతా
ఇది మా తరతరాల
కల అంటూ
ఇది మా జీవితకాల
ధ్యేయం అంటూ
పాటలే పాడారో
ఈలలే వేశారో
గుట్టుగా దొంగ గుద్దులే
గుద్దారో
అమ్మన్ని
అదిగో అక్కడ
ఆ పీఠం పై కూకుంది.....
కన్నీళ్లు తుడిచానంటూ
ఒకడొచ్చి చెంపలు
నిమిరిపోయాడు
ఏం సాధించావ్ తల్లీ !
సెహభాష్ అంటూ
వేరొకడొచ్చి దుశ్శాలువా
కప్పుతూ సుతారంగా
భుజాలు నిమిరేశాడు
ఆహా మా ఆడబిడ్డ అంటూ
మరొక మిడిగుడ్లోడు
మీది మీది కొచ్చి ఇకఇకలతో
ఒళ్లంతా నింపాడు
ఎదిగిన చెట్టు
పొదిగిన గుడ్డు
నా ఇంటి ఆస్తి అంటూ
అసలోడు సంతకానికి
నకలుగా మారాడు....
ఇప్పుడా తల్లి
చట్టబద్ధంగా చట్టసభకు సుట్టం
నమ్మి నడిపించి సాగనంపిన
ఆశలకు కొడికట్టు దీపం
తొర్రి పళ్ళ మారాజు కూసే
తొర్రి కూతలకు
ప్రప్రథమ సాక్ష్యం
మానాలెందుకు
అవమానాలెందుకు
ఎదిరింపుల గోలలెందుకు
ఆర్చుకోకున్నా ఓర్చుకోకున్నా
ఆగని అత్యాచారాలకు
అట్టా గగ్గోళ్లు ఎందుకు
అనే మా సాముల మాటలకు
ఎకిలి నవ్వుల మేళాకు
ఆమె ఆది తాళం
అనాదిగా బుర్రను కోల్పోయిన
తాళపు కప్పకు సిసలు సంకేతం...
జయహో వీర వనితా....
నీకివే నీ దినోత్సవ
వందనాలు
- సుధా మురళి
94913 11049