Nov 07,2023 21:15

రైతు భరోసా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య

ప్రజాశక్తి-గజపతినగరం :  వర్షాభావ పరిస్థితులను చూసి రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి భరోసా ఇచ్చారు. పంట పోయిన చోట ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదా బీమా పరిహారాన్ని ఇప్పించడానికి కృషి చేస్తామని అన్నారు. గజపతినగరం మార్కెట్‌యార్డులో మంగళవారం జరిగిన రైతు భరోసా-పిఎం కిసాన్‌ విడుదల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జిల్లాలోని సుమారు 2,63,394 మంది రైతులకు, రూ.108.42 కోట్ల రైతు భరోసా చెక్కును అందజేశారు. పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పిఎం కిసాన్‌ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి నగదు విడుదల చేశారు. బటన్‌ నొక్కి ఒక్కో రైతు ఖాతాలో రూ.4వేలు చొప్పున జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులపై ప్రతీరోజూ సమీక్ష నిర్వహిస్తున్నామని, ఎండిపోయిన పంటల వివరాలను రోజువారీగా తెలుసు కుంటున్నామని చెప్పారు. ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామని, రైతులు ఈ కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి, తమ పంటల వివరాలను తెలియజేయవచ్చునని సూచించారు. వరి పంటకు గ్రామం యూనిట్‌గా దిగుబడి లెక్కిస్తామన్నారు. రైతు సమస్యలను గుర్తించేందుకు వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తతంగా పర్యటించాలని ఆదేశించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ, రైతుకు అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. గత నాలుగేళ్లతో పోలిస్తే, ఈ ఏడాది వర్షపాతం కొంత తగ్గిందని, అయినప్పటికీ రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీటినంతా వ్యవసాయానికి మళ్లిస్తున్నామని చెప్పారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ, డ్రోన్‌ల ద్వారా ఎరువులు, పురుగు మందులు జల్లేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఎంఎల్‌ఎ తెలిపారు.
డిసిఎంఎస్‌ ఛైరపర్సన్‌ డాక్టర్‌ అవనాపు భావన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జెడ్‌పిటిసి సభ్యులు గార తవుడు మాట్లాడుతూ, చాలా చోట్ల వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, తమ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ వేమల ముత్యాలరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి వి.టి.రామారావు మాట్లాడారు. వ్యవసాయానికి ఉపయోగించే డ్రోన్‌ను ఈ సందర్భంగా ప్రయోగాత్మకంగా పరీక్షించి రైతులకు చూపించారు. జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశు సంవర్థకశాఖ, డిసిసిబి అధికారులు, ఎడిఎలు మహారాజన్‌, అన్నపూర్ణ, ఎఒలు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.