ప్రజాశక్తి - విజయవాడ : ఎన్‌రోల్‌మెంట్ కిట్ల ద్వారా ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పుల ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తిచేసి ప్రజలకు సేవలందించాలని ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సచివాలయ సిబ్బందికి సూచించారు. ఆధార్‌కార్డుల్లో చేర్పులు, మార్పుల ప్రక్రియను మంగళవారం కుమ్మరిపాలెం 119 సచివాలయాన్ని ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 65 సచివాలయాల్లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కిట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడ నగరంలో 25, విజయవాడ రూరల్ మండలంలో 4, మిగిలిన మండలాల్లో మండలానికి రెండు సచివాలయాల్లో ఆధార్లో మార్పుల ప్రక్రియను సులభతరం చేశామన్నారు. సెప్టెంబర్ 21న 119 సచివాలయంలో ఆధార్ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. సచివాలయ సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట సబ్‌కలెక్టర్ అదితి సింగ్, పశ్చిమ తహశీల్దారు ఎం.మాధురి, విఆర్‌ఒ కె.బేబి ఉన్నారు.










