ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : కొండమోడు-పేరేచర్ల రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి అసైన్డ్ భూములకూ పట్టా భూములు మాదిరి పరిహారం చెల్లిస్తామని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. విస్తరణకు భూ సేకరణపై ఆర్‌డిఒ కార్యాలయంలో రైతులతో మంగళవారం సమావేశమయ్యారు. గుర్తించిన భూములకు సంబంధించి రైతు యాజమాన్యపు హక్కులను పరిశీలించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు దస్తావేజుల జిరాక్స్ కాపీలను రైతుల నుండి సేకరించారు. భూములు కోల్పోతున్న ధూళిపాళ్ల, కంకణాలపల్లి, సత్తెనపల్లి రైతులతో జెసి మాట్లాడుతూ నోటిఫికేషన్ జారీచేసిన తేదీ నాటికి గత మూడేల్ల రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకుంటామని, దానికి రెండున్నర రెట్లు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.60 లక్షల నుండి రూ.కోటి వరకు ఉందని, దాని ప్రకారం పరిహారం చెల్లించాలని జెసికి రైతులు విన్నవించారు. అయితే ఆధారాల మేరకే పరిహారం చెల్లిస్తామని జెసి స్పష్టం చేశారు. జూన్‌లో భూములు రిజిస్ట్రేషన్ వ్యాల్యూషన్ ప్రభుత్వం పెంచిందని, ఆ మేరకు పరిహారం చెల్లించాలని రైతులు కోరడంతోపాటు వారి అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇచ్చారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గద్దె చలమయ్య మాట్లాడుతూ భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్లు పరిహారం చెల్లించాలన్నారు. భూములు స్వాధీనం చేసుకున్న రోజున ఉన్న రిజిస్ట్రేషన్ వ్యాల్యూషన్ ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆర్‌డిఒ బిఎల్‌ఎన్ రాజకుమారి, తహశీల్దార్ సురేష్ పాల్గొన్నారు.
కందిపప్పు ఇవ్వడం లేదన్న కార్డుదరులు
ఇంటింటికి రేషన్ బియ్యం వాహనాన్ని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న వాహనాన్ని పరిశీలించి కార్డుదారులతో మాట్లాడారు. కందిపప్పు ఇవ్వటం లేదని కార్డుదారులు చెప్పడంతో ఆపరేటర్‌ను జెసి వివరణ అడిగారు. తక్కువ వస్తుండడంతో కొంతమందికే పంపిణీ చేస్తున్నామని ఆపరేటర్ చెప్పారు. జెసి వెంట ఆర్‌డిఒ బిఎల్‌ఎన్ రాజకుమారి, తహశీల్ధార్ సురేష్, పౌరసరఫరాల పర్యవేక్షణ అధికారి అరుణాదేవి ఉన్నారు.










