Aug 22,2023 00:17

గూడూరు ఆర్డీవో కిరణ్‌కుమార్‌

ఆధార్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

ప్రజాశక్తి-బాలాయపల్లి:
మొబైల్‌ ఆధార్‌ క్యాంపుల్లో ఆధార్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఆర్డీవో కిరణ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోనూ ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు మొబైల్‌ ఆధార్‌ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతనంగా ఆధార్‌కార్డు నమోదు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దాటిన బాల బాలికలకు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ అప్డేట్‌ సేవలు పూర్తి ఉచితంగా పొందవచ్చనన్నారు. ఆధార్‌ కార్డు ప్రింట్‌ కోసం రూ.30, ఇంటి చిరునామా మార్పు కోసం రూ.50, ఇంటి చిరునామాతో పాటు బయోమెట్రిక్‌ అప్డేట్‌ కోసం రూ.100 రుసుం చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2010 నుంచి 2016 సంవత్సరాల మధ్య ఆధార్‌ నమోదు చేసుకొని, ఆ తర్వాత ఒక్కసారి అప్డేట్‌ చేసుకోని వారు ఏదైనా రుజువు సమర్పించి తమ ఆధార్‌ కార్డును అప్డేట్‌ చేసుకోవాలని, ఇందుకోసం రూ.50 రుసుం చెల్లించాలని తెలిపారు. నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లా పరిధిలోని పౌరులు తమ ఆధార్‌ కార్డు చిరునామాలో పాత జిల్లాల పేర్లను తిరుపతి జిల్లాగా మార్చుకునేందుకు అవకాశం కల్పించబడిందని, సమీపంలోని ఆధార్‌ క్యాంపు వివరాల కోసం సమీప గ్రామ, వార్డు సచివాలయాన్ని, వాలంటీర్లను సంప్రదించాలని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,52,755 ఆధార్‌ సేవలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. డివిజన్‌ పరిధిలోని ప్రజలందరూ ఆధార్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.