Aug 25,2023 23:57

ఈపూరు: సెప్టెంబర్‌ 1 నుండి బ్యాంకు ఖాతాకు ఆధార్‌ నెంబర్‌ జత చేసిన ఉపాధి కూలీలకు మాత్రమే వేతనాలు అందు తాయని డ్వామా పీడీ జి.జోసెఫ్‌ కుమార్‌ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో 12,000 మంది ఉపాధి కూలీలు బ్యాంకు ఖాతాకు ఆధార్‌ నెంబర్‌ జత కాలేదన్నారు. పల్నాడు జిల్లాలో 5,53,874 లక్షల మంది ఉపాధి కూలీలు ఉండగా వారిలో 3,28,267 మంది పనిలో ఉన్నారన్నారు. 2022- 23 ఉపాధి పనులకు సంబంధించి రూ.180 కోట్లు ఖర్చు చేశామన్నారు. జిల్లాలో వెయ్యి ఎకరాలలో ఉద్యాన తోటలు సాగును లక్ష్యంగా పెట్టుకోగా 718 ఎకరాలు ఉద్యాన తోటలు సాగులో ఉన్నాయని సెప్టెంబర్‌ చివరి కల్లా నూరు శాతం సాధిస్తామన్నారు. అలాగే వర్షపు నీటిని వధా కాకుండా భూమిలోకి నీరు ఇంకే విధంగా రూప్‌ టాప్‌ వాటర్‌ ఇన్వెస్టింగ్‌ సిస్టం కార్యక్రమాన్ని ప్రభుత్వ భవనాలలో అమలు చేస్తున్నామన్నారు. పల్నాడు జిల్లాలో 9 మండలాలలో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పీడీ తెలిపారు.