ప్రజాశక్తి - కురుపాం : మండల కేంద్రంలో గల శోభలతాదేవి కాలనీలో పాడుబడిన ఓ ఇంట్లో నివాసముంటుంది మతిస్థిమితం లేని పట్లాసింగి గంగమ్మ (65). ఈమెకు నా అంటూ ఎవరూలేని అనాధ. గతంలో ఆమెకు రూ.200 పింఛన్ అందేది. అయితే పెన్షన్‌కు ఆధార్ అనుసంధానం చేయడంతో ఆమె వద్ద ఎటువంటి ఆధారాలు లేక వచ్చే ఆ రూ.200 పింఛను కూడా నేటికి ఎనిమిదేళ్ల నుంచి నిలిపేశారు. అయినప్పటికీ కాగితాలు, బాటిల్లు వేరుకొని ఎవరైనా ఏదైనా ఇస్తే తినేది తప్ప మతిస్థిమితం లేనప్పటికీ ఎవర్నీ ఏమి చేయి చాచీ అడగదు. ప్రస్తుతం ఆమెకు కళ్లు కనిపించడం లేదు. దీంతో బయటకు వెళ్లలేని స్థితిలో నా అనుకునే వారు ఎవరు ఉన్నారో లేదో కూడా ఆమెకు తెలియదు. ఒకవేళ ఉన్న వారు ఈమెను పట్టించుకోవడం లేదు. కళ్లు కనిపించకపోవడంతో ఆమె పరిస్థితి మరింత దుర్భరమైంది. దీంతో ఎవరైనా ఏదో ఇస్తే తింటుంది లేదంటే పస్తువులు ఉంటుంది.
ఏ దిక్కు లేని ఆమెకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాల్లో శస్ర చికిత్స చేయిస్తే కళ్లు కనిపిస్తాయని ఇరుగుపొరుగు వారు అంటున్నప్పటికీ ఆధార్ కార్డు తెమ్మంటున్నారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇన్సూరెన్స్, హెల్త్, పథకాలే కాదు సంక్షేమ పథకాలు కూడా వర్తించవు. ఆధార్ కార్డు లేకపోయినా పాన్‌కార్డు, ఓటరు కార్డు, బ్యాంకు అకౌంటు, వాటర్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, బర్త్ సర్టిఫికెట్ వీటిలో ఏదైనా ఉండాలి. ఇవేవీ లేని గంగమ్మ కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలకు అనర్హురాలిగా మిగిలింది. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటటీ, ఫ్రూఫ్ ఆఫ్ అడ్రస్ కాగితాలు లేనిదే తామేమీ చేయలేమని ప్రభుత్వ సిబ్బంది చెబుతున్నారు. తను ఈ దేశ మనిషిని కాదా?' అని ఆమె తరుపున పలువురు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పేదెవరు? దీనికి ప్రభుత్వం, ఉన్నతాధికారులే స్పందించి పరిష్కారం చూపాలి. జిల్లా ఉన్నతాధికారులు తనకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటినీ కల్పించి సంక్షేమ పథకాలు అందించి ఆదుకొనేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.










