Jan 11,2023 23:42

అదాని దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న అప్పలనర్ప, నాయకులు

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన ప్రాంతంలో అడవులను హైడ్రో పవర్‌ ప్రాజెక్టు పేరుతో అదానీ పరం కానివ్వమని, దీని అనుమతులు రద్దు చేసే వరకు ఉద్యమం సాగిస్తామని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స వెల్లడించారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కార్పొరేట్‌ సంస్థ యజమాని అదానీ దిష్టిబొమ్మని గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఐటీడీఏ వద్ద దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి ఏజెన్సీలో గ్రీన్‌ ఎనర్జీ పేరుతో 15 వేల ఎకరాల పచ్చటి అడవిని, రిజర్వ్‌ ఫారెస్టును కార్పొరేట్‌ సంస్థ అదాని, శిరిడి సాయి ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌కు హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ పేరుతో అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. జగన్‌, మోడీలు తమ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడవిని దారా దత్తం చేస్తున్నారని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీకి సుమారు 75 వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడుతుందని, ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. నేటికీ అధానీ కంపెనీ గత ఎనిమిదేళ్లలో రెండు లక్షల పదివేల ఎకరాల భూమిని రాష్ట్రంలో పొందినప్పటికీ పరిశ్రమలు ఎక్కడా ప్రారంభించలేదని, ఉపాధి కల్పించలేదని అదే పరిస్థితి ఆదివాసి గిరిజన ప్రాంతంలో వస్తుందన్నారు. అడవిని ధ్వంసం చేసి తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకునే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రని, కార్పొరేషన్‌ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని తెలిపారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ ను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిస్తూ రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించిన నిర్ణయాన్ని ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.ఐదో షెడ్యూల్‌ ఏరియాలో గ్రామసభ, గిరిజన సలహా మండలి (టి. ఏ.సి) తీర్మానం లేకుండా కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిస్తూ క్యాబినెట్‌ ఆమోదం చట్ట వ్యతిరేకమైం దన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా గత రెండు సంవత్సరాల నుండి హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం దొంగచాటుగా టూరిస్ట్‌ల పేరుతో సర్వే నిర్వహించాయని విమర్వించారు. పర్యావరణ ప్రభావాన్ని, గిరిజన హక్కులు, చట్టాలు, ఐదో షెడ్యూల్‌ నిబంధనలను పరిశీలించకుండా ఏకపక్షంగా అదాని, శిరిడి సాయి కంపెనీలకు హైడ్రో పవర్‌ ప్రాజెక్టు పేరుతో ఆగమేఘాలపై అనుమతులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరంలో నిర్వాసితులను ఆదుకోలేని ప్రభుత్వం, హైడ్రో పవర్‌ ప్రాజెక్టులో నిరశ్రయులను ఆదుకుంటామని చెప్పడం మోసకారి విధానానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎల్‌.సుందర్రావు, గిరిజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి కూడా రాధాకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కొర్ర ప్రభుదాస్‌, చిన్నారావు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు:హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ ను తక్షణమే రద్దు చేయాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులు, గిరిజనులకు ప్రత్యేక చట్టం 1/70 ఉండగా కార్పొరేట్‌ శక్తులకు స్థలాలు లీజుకు ఇచ్చినా చట్టరీత్య నేరమన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల స్వలాభం, రాజకీయ లబ్ది కోసం గిరిజన ప్రాంతాన్ని అమ్మేమాలని ప్రయత్నాలు చేడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించే వరకు పోరాడతామని, హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణాల కు జారీ చేసిన అనుమతులు తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రామదాసు, కొర్ర నరసయ్య, గోవర్ధన్‌ పాల్గొన్నారు.
అనుమతులు రద్దు చేయాలి: జెడ్‌పిటిసి గంగరాజు
అనంతగిరి:కేంద్రం, రాష్ట్ర లు అధాని గ్రూప్‌ కంపెనీకి ఇచ్చిన హైడ్రో పవర్‌ ప్రాజెక్టు అనుమతుల రద్దు చేయాలని గిరిజన సంఘం ఆద్వర్యంలో డముకు వరపు సంతలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ దీసరి గంగరాజు మాట్లాడుతూ, మోడి, జగన్‌ ఇద్దరు కలిసి గిరిజన చట్టాలను తుంగలో తొక్కి చింతపల్లి మండలం ఎర్రవరం, అనంతగిరి మండలంలో పెదకోట, టోకురు పంచాయతీ చిట్టంవలస, గూమ్మకోట పంచాయతీ గుజ్జలిలలో గిరిజన భూములు అధానికి కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ విషయమై ఎమ్మెల్యేలు చెట్టి. పాల్గుణ భాగ్యలక్ష్మి లు నోరు మెద్దప లేదని, అధాని గ్రూప్‌కి ఎంతకీ అమ్ముడు పోయారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చట్టాలకు రక్షణ కల్పించవలసిన శాసనసభ్యులే నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు రద్దు చేసే వరకు గిరిజనలతో ఉద్యమం చేస్తామని, దీనిపై జిల్లా పరిషత్‌ సమావేశంలో ప్రస్తావిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోమెల నాగులు, టోకురు సర్పంచ్‌ కిల్లో మోస్య, గిరిజన సంఘం నాయకులు గెమ్మెల దేవన్న, పూర్ణనందు, బుద్రయ్య, వెంకటరమణ, మజ్జి అప్పన్న, వార్డు మెంబరు చంద్రన్న పాల్గొన్నారు.