Oct 14,2023 22:35

అడవుల్లో 'డ్రోన్‌' సాయంతో విత్తనాల వెదజల్లేత

అడవుల్లో 'డ్రోన్‌' సాయంతో విత్తనాల వెదజల్లేత

వృక్షసాంద్రతను మరింత పెంచడానికే : డీఎఫ్‌ఓ సతీష్‌ రెడ్డి
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): అడవుల్లో వృక్ష సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతంలో మరింతగా పెంచుతూ పచ్చదనాన్ని పెంపొందించడానికి డ్రోన్‌ సహాయంతో విత్తనాల వెదజల్లే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం శేషాచలం అటవీ పరిధిలోని మామండూరు అటవీ ప్రాంతంలో గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌, నూజివీడు సీడ్స్‌ వారి సహకారంతో మారుతీ డ్రోన్స్‌ టెక్నాలజీ పార్ట్నర్‌ గా మామూలు అటవీ ప్రాంతంలోని 10 ఎకరాల విస్తీర్ణంలో 50 వేల సీడ్‌ బాల్స్‌ను డ్రోన్‌ ద్వారా వెదజల్లారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అటవీ ప్రాంతంలో దట్టంగా వక్షాలను నెలకొల్పాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని డిఎఫ్‌ఓ సతీష్‌ రెడ్డి తెలిపారు. ఈ డ్రోన్స్‌ ద్వారా రావి, జామ వంటి విత్తనాలను చల్లామన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా 10 లక్షల సీడ్‌ బాల్స్‌ ను 25 అటవీ ప్రాంతాలలో వెదజల్లామన్నారు. పనబాకం, ముంగిలిపట్టు, కాశిపెంట్ల తదితర ప్రాంతాలలో సీడ్‌ బాల్స్‌ ను అడవిలో డ్రోన్‌ ద్వారా వేశామన్నారు. ఈ కార్యక్రమానికి పనపాకం ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి మాధవి వారి సిబ్బంది తగిన సహాయ సహకారాలతో విజయవంతంగా సీడ్‌ బాల్స్‌ ను వెదజల్లారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్‌ డిఎఫ్‌ఓ శ్రీనివాసరావు, డిఆర్‌ఓ చినబాబు, బీట్‌ ఆఫీసర్లు అనిత, జ్యోతి, మునెమ్మ, జమున పాల్గొన్నారు.