ప్రజశక్తి - చీరాల
తీర ప్రాంతంలో మడ అడవుల పెంపకం, వాటి సంరక్షణ గురించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు బాపట్ల జిల్లా అటవీ అధికారి ఎల్ భీమయ్య తెలిపారు. సముద్రతీర పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ, చెన్నై ట్రీ ఫౌండేషన్ సహకారంతో రామాపురంలో ఆదివారం నిర్వహించారు. వాడరేవు సమీపంలో ఉన్న నగరవనంలో చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణలో ట్రీ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. జీవవైవిద్యాన్ని పరిరక్షించాలంటే సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయ కర్త పవని భానుచంద్రమూర్తి మాట్లాడుతూ భూమండలంపై ఏటా సుమారు మూడున్నర కోట్ల టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం పేరుకుపోతుందని అన్నారు. అందులో నాలుగోవంతు దాకా సముద్ర జలాల్లోకి చేరుతుందని గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. సముద్ర జలాలు ఉప్పగానే కాదు యాసిడ్ లాగా కూడా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి నీటిలో జీవులు బతకలేవని అన్నారు. కార్యక్రమంలో ట్రీ ఫౌండేషన్ చీరాల ప్రతినిధి శవనం చంద్రారెడ్డి, సెక్షన్ ఆఫీసర్ జాన్సన్, బీట్ ఆఫీసర్ రాగమ్మ పాల్గొన్నారు.










