Nov 14,2021 13:02

ఓ రోజు అడవిలోని జంతువులన్నీ సరదాగా కబుర్లు చెప్పుకునేందుకు సాయంత్రం వేళలో చెట్టు కిందకు చేరాయి. అయితే పిల్ల జంతువుల ముఖాల్లో ఎక్కడా సంతోషం కనపడటం లేదు. పెద్ద జంతువులు గమనించి, వాటిని ప్రశ్నించాయి. అవి చెప్పటానికి తటపటాయించాయి. పెద్ద జంతువులు గద్దించగా, చిన్నవి కళ్లు మూసుకుని పుట్టినప్పటి నుంచి ఈ అడవిలో తిరగటం విసుగ్గా ఉంది. ఓ సరదా లేదు.. ఆనందం లేదు. లేచిన దగ్గర నుంచి ఈ అడవి తప్పితే ఎక్కడకూ వెళ్లింది లేదు. ఏమీ చూసింది లేదు. మనకంటే మనుషులే నయం. కనీసం సెలవు రోజుల్లో... కొత్త ప్రదేశాలు చూస్తారు. ఆనందంగా గడుపుతారు అన్నాయి. పెద్ద జంతువులు ఆలోచనలో పడ్డాయి. తమ పిల్లలనూ సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్లాలని నిర్ణయించాయి. అదే సమయంలో ఒక తీర్మానమూ చేశాయి. ఇక నుంచి ప్రతి ఆదివారం పక్కనున్న అడవిలోకి వెళ్లి, సరదాగా గడుపుదాం అని పిల్ల జంతువులకు చెప్పాయి.
ఆదివారం వచ్చింది. ఉదయాన్నే పిల్ల, పెద్ద జంతువులన్నీ బ్రహ్మాండంగా ముస్తాబై, దగ్గరలోని అడవిబాట పట్టాయి. అక్కడకు చేరాక పిల్ల జంతువులకు ఆకలి వేయటం ప్రారంభమైంది. మరికొన్ని 'దాహం దాహం' అని ఏడవసాగాయి. పెద్ద జంతువులు వాటిని సముదాయించాయి. ఆ కొత్త అడవిలో పిల్లల ఆకలి తీర్చేందుకు పండ్లు ఉన్న చెట్టుగానీ, కనుచూపు మేరలో నీళ్లుగానీ కనపడలేదు. అదే సమయంలో దూరంగా చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుడు కనిపించాడు. ఆయన దగ్గరకు వెళ్లి, తమ కష్టాన్ని చెప్పి తరుణోపాయం చూపమన్నాయి. మొదటగా తన మంత్రశక్తితో జంతువులకు ఆహారం, మంచినీరు అందించాడు ముని. ఓ ఎలుగుబంటి ముని ముందుకొచ్చి 'స్వామీ! ఈ అడవిలో ఏ చెట్టుకూ ఒక్క పండుగానీ, చుక్క నీరుగానీ దొరకటం లేదు కారణం ఏమిటి?' అని ప్రశ్నించింది. ముని పెద్దగా నవ్వి 'ఈ అడవికి దగ్గరగా ఉండే ఊరి ప్రజలు ప్రతి ఆదివారం సరదాగా ఇక్కడకు వస్తారు. చెట్ల పండ్లన్నీ కోసేస్తారు. చెరువులో జలకాలాడతారు. చివరకు పెద్ద డ్రమ్ముల నిండా నీళ్లు పట్టుకుపోతారు. ఇలా చుట్టుపక్కల అడవులన్నీ ఖాళీ అయిపోయాయి. ఇక్కడి జంతువులు ఆహారం దొరక్క వేరే అడవులకు తరలిపోయాయి. ఇక మిగిలింది మీ అడవే. అది గ్రామాలకు దూరంగా ఉండటంతో మనుషులు అక్కడకు రావటానికి సాహసం చేయటం లేదు!' అని ముగించారు. పిల్ల జంతువులన్నీ కోపంతో 'సరదా లేదు, గిరదా లేదు మన అడవే మనకు కన్నతల్లి. ఇంకెప్పుడు అడవిని వదిలి, బయటకు రావద్దు!' అంటూ వచ్చిన దారినే ఇంటిముఖం పట్టాయి. పెద్ద జంతువులూ వాటిని అనుసరించాయి.

తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర
94923 09100