ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు వేసి సుందరీకరణ చేసేందుకు 2017లో అప్పటి టిడిపి ప్రభుత్వ హయాంలో మున్సిపల్ పాలక వర్గం కౌన్సిల్ సభ్యులు చేపట్టిన పనులు బూడిదలో పోసిన పన్నీరులా పనికి రాకుండాపోయింది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కౌన్సిలర్లు 13వ ఆర్థికసంఘం నిధుల్లో రూ.16.69 లక్షలు ఖర్చు పెట్టేందుకు ప్రతిపాదనలు చేసి కౌన్సిల్ సాధారణ సమావేశం లో ప్రవేశపెట్టారు. ఆ ప్రతిపాదనను అప్పటి ప్రతిపక్ష వైసిపి కౌన్సిల్ సభ్యులు ప్రైవేటు యజమానుల స్థలాల్లో సుందరీకరణ పనులు వద్దని అభివృద్ధిని నోచుకోని పలు వార్డులలో ఖర్చు చేయాలని డిమాండు చేసి వ్యతిరేకించారు. అయినా అధికార పక్ష కౌన్సిల్ సభ్యులు ఏకపక్షంగా బైపాస్ రోడ్డుకు ఇరువైపులా సుందరీకరణ పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ సుందరీకరణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రాంతంలో మొక్కలు వేసి ఇనుప కంచెలు పెట్టి మొక్కలకు నీటి సదుపాయం నిమిత్తం బోరు వేసి కొంతకాలం పర్యవేక్షణ చేపట్టారు. ఏమైందో ఏమో గాని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఈ సుందరీకరణ చేసిన ప్రాంతాన్ని పట్టించుకోకపోవడంతో మొక్కలు చెట్లుగా అడ్డుగోలుగా పెరిగి అడవిని తలపించేలా తయారయ్యాయి. బైపాస్ రోడ్డులో ప్రయాణం చేస్తున్న పాదచారులు, వాహనచోదకులు ఈ సుందరీకరణ పనులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వాటి నిర్వహణకు సంబంధిత మున్సిపల్ అధికారులు గాలికి వదిలేసి పట్టించుకోకపోవడంతో లక్షలాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులా వృథాగా పోయిందని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.










