Nov 08,2023 00:28

పట్టాలు అందచేస్తున్న కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి-గుంటూరు : పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా ఇంటి పట్టాలు అందించడంతో పాటు, ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉపరవాణ కార్యాలయం సమీపంలోని దాక్షిణ్య విద్యాసంస్థల ఆవరణలో నిర్వహించిన సభలో ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని అడవితక్కెళ్లపాడు ప్రాంతవాసులకు పేదలందరికీ ఇళ్ల పధకం ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, నగర మేయర్‌ కావటి శివనాగమనోహర్‌నాయుడు హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా అత్యంత పారదర్శకంగా పేదలదరికీ ఇళ్ల పథకంలో జిల్లాలో దాదాపు 1.50 లక్షల మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. దీని కోసం ప్రభుత్వ భూములతో పాటు, ప్రైవేటు భూములను రూ.1451 కోట్లతో కొనుగోలు చేసి ప్రైవేటు లే ఔట్లకు దీటుగా అంతర్గత రహదారులు, లెవలింగ్‌ చేసి ప్లాట్లు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. వీటిలో కోర్టు కేసుల కారణంగా 1400 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడం నిలిచిపోయిందని, వీరికి ప్రత్యామ్నాయ స్థలాలు సేకరించి ప్రస్తుతం అడవితక్కెళ్లపాడు వాసులు 752 మందికి ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యే, మేయర్‌ మాట్లాడుతూ ఇంటి పట్టాలు అందుకున్న వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ సజీలా, కార్పొరేటర్‌ స్మిత పద్మజ, ఆర్‌అండ్‌బి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మేరి, తహశీల్దారు సాంబశివరావు పాల్గొన్నారు.