Apr 21,2023 00:02

మాట్లాడుతున్న అప్పలనర్స

ప్రజాశక్తి-పాడేరు: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గిరిజన చట్టాల్ని, హక్కుల్ని కాలరాసి ఆదివాసీలను అడవి నుంచి గెంటి వేయాలని చూస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనరస ధ్వజమెత్తారు. గురువారం స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక గిరిజన హక్కుల్ని, చట్టాలను బలహీనపరుస్తూ అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించి ఆదివాసీలను అడవి నుంచి గెంటివేయాలని మోడీ సర్కార్‌ కుట్ర చేస్తోందని విమర్శించారు. ఆదివాసీలను గెంటివేసి అడవిని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిం చాలని చూస్తోందన్నారు. 24న పాడేరు లో నిర్వహించే బహిరంగ సభ ను జయప్రదం చేయాలని పిలునిచ్చారు. బిజెపి చర్యలను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా సిపిఎం, సిపిఐలు కలిసి ప్రచార భేరీ కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీలేరు నుంచి ప్రారంభించి పాడేరు నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో నిర్వహిస్తున్న పాదయాత్ర ప్రచార భేరీ కార్యక్రమం ముగింపు రోజున పాడేరులో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, దీనికి ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి హాజరవుతున్నారని తెలిపారు. ఈ ప్రచార బేరిలో భాగంగా విస్తతంగా ప్రచారం సాగించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్‌, సిపిఎం మండల కార్యదర్శి ఎల్‌. సుందరరావు, సీపీఐ మండల కార్యదర్శి కూడ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.