Apr 22,2022 05:54
  • విద్యా విధానంలోగాని, విద్యుత్‌ రంగంలోగాని, చెత్తపన్ను వంటి యూజర్‌ చార్జీల విషయంలోగాని, సముద్ర తీరంపై పెత్తనాన్ని బడా కార్పొరేట్లకు కట్టబెట్టే విషయంలోగాని, తాజాగా రేషన్‌ బియ్యం బదులు నగదు బదిలీ విధానం అమలు చేయడంలోగాని ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఎందుకు ముందు వుంది? ఈ ప్రశ్నలకు జగన్‌ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి.
  • అటు సంక్షోభ భారాలు, ఇటు విద్వేషపూరిత దాడులతో నలిగిపోతున్న ప్రజానీకాన్ని సంఘటితం చేసి, వారికి ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన బాధ్యత వామపక్షాల మీదే వుంది. జహంగీర్‌పురి లో బృందాకరత్‌ ప్రజలకు అండగా నిలిచిన తీరు అభినందనీయమే కాదు. మనమంతా ఆచరించాల్సిన విధానం.

దేశంలో ఆర్థిక పరిస్థితి అదుపు తప్పుతోంది. ప్రజల వద్ద వున్న కొనుగోలు శక్తి పడిపోతుంటే ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం కలగలసి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజలను ఈ భారాల నుంచి ఆదుకోవలసిందిపోయి ప్రభుత్వాలే ప్రజలపై భారాలు మోపుతున్నాయి. గత 12 నెలలుగా టోకు ధరల సూచిక వరుసగా 10 శాతానికి మించి పెరుగుదలను నమోదు చేసింది. తాజాగా 2022 ఫిబ్రవరిలో 13.1 శాతం నమోదు కాగా మార్చి 2022లో 14.55 శాతానికి ఎగిసిపడింది.
ప్రధానంగా విద్యుత్తు, చమురు ధరలు పెరగడం...ప్రజలు నిత్యం ఉపయోగించే సరుకుల ధరలు పెరగడం ఇందుకు కారణం. ఫిబ్రవరిలో విద్యుత్తు, చమురు ధరలు 2.7 శాతం పెరిగితే మార్చి నెల వచ్చే సరికి అది రెండింతలకు మించి 5.68 శాతం పెరిగింది. నిత్యావసర సరుకుల ధరలు ఫిబ్రవరిలో 13.39 శాతం పెరిగితే మార్చిలో 15.54 శాతం పెరిగాయి.
మార్చి 2021లో టోకు ధరల సూచిక 7.89 శాతం పెరుగుదల నమోదు చేస్తే మార్చి 2022 నాటికి 14.55 శాతం- అంటే దాదాపు రెట్టింపు పెరిగింది.
ఇంకో పక్క సామాన్య కార్మికులు, వ్యవసాయ కూలీలు తగ్గిపోతున్న ఆదాయాలతో తక్కిన తరగతుల ప్రజలకన్నా ఎక్కువ నలిగిపోతున్నారు. మన రాష్ట్రంలో ఉపాధి కూలీల దినసరి వేతనం 2021 ఏప్రిల్‌లో సగటున రూ.215 వద్ద వుంటే 2022 ఏప్రిల్‌ వచ్చేసరికి అది అమాంతం సగటున రూ.160కి పడిపోయింది. అంటే దాదాపు 25 శాతం తగ్గింది!
దేశ ఆర్థిక వృద్ధి రేటు 9 శాతం పైనే వుంటుందని ప్రభుత్వ ప్రతినిధులు నిన్న మొన్నటి దాకా చెప్తూ వచ్చారు. ఐఎంఎఫ్‌ కూడా జనవరి 2022లో 9 శాతం వృద్ధి రేటును మన దేశం సాధించగలుగుతుందని జోస్యం చెప్పింది. కాని తాజాగా దానిని 8.2 శాతానికి కుదించింది. అయితే ఇది 8 శాతం మాత్రమే వుంటుందని ప్రపంచ బ్యాంకు, 7.5 శాతమేనని ఏషియన్‌ అభివృద్ధి బ్యాంకు, 7.2 శాతమే అని రిజర్వు బ్యాంకు అంచనాలు ప్రకటించాయి. పైగా 2023-24 సంవత్సరానికి ఇది ఇంకా తగ్గి 6.9 శాతం మాత్రమే ఉండబోతున్నదని ఐఎంఎఫ్‌ ప్రకటించింది.
ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కూడా 3.6 శాతం మాత్రమే వుంటుందని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇది 4.4 శాతంగా వుండవచ్చునని వేసిన ముందస్తు అంచనాలు తప్పాయని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా కొన్ని సరుకుల పంపిణీ వ్యవస్థ దెబ్బతినడం ఒక కారణం. తాజాగా చైనా మరోసారి కోవిడ్‌ ముప్పుని ఎదుర్కొనే పోరాటంలో లాక్‌డౌన్‌లు విధించడం వలన ఆ దేశంలో ఉత్పత్తి రంగం, వాణిజ్యం కుంటుపడ్డాయి. కోవిడ్‌ సంక్షోభం వచ్చి పడడంతో అప్పటికే చిక్కుల్లో వున్న ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత సంక్షోభంలో పడింది. 2022లో తిరిగి కోలుకోవచ్చునన్న అంచనాలు ఉక్రెయిన్‌ సంక్షోభంతో మళ్లీ తప్పాయి.
కోవిడ్‌ అనంతరం ప్రపంచ వాణిజ్యంలో కొంత వేగం పెరిగింది. ముఖ్యంగా 42,000 కోట్ల డాలర్ల మేరకు ఎగుమతులు పెరుగుదల నమోదు చేశాయి. అయితే ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ 2021తో పోల్చితే 2022లో ఈ ఎగుమతుల వృద్ధి పడిపోతుందని భావిస్తోంది. ముందు అంచనా వేసినట్టు 4.7 శాతం వృద్ధి కాకుండా కేవలం 3 శాతమే వుంటుందని తాజాగా ప్రకటించింది.
కోవిడ్‌ పూర్వ స్థితికి ఉపాధి లభ్యత చేరాలంటే అందుకు ఇంకో నాలుగేళ్లు ఆగాలని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. 2019 నాటికి వున్న ఉపాధి అవకాశాలు 2026 నాటికి కాని మళ్లీ రావు. మరి ఈ ఏడేళ్ల కాలంలో పెరిగిన నిరుద్యోగం మాటేమిటి? అంటే 2023 తర్వాత కూడా ప్రపంచ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు.
'ఇది సంక్షోభం మీద వచ్చి పడిన మరో సంక్షోభం' అని ఐఎంఎఫ్‌ అభివర్ణించింది.
'సామాన్య కుటుంబాలు ఈ సంక్షోభ భారాలను ఇంకెంత మాత్రమూ తట్టుకోగలిగిన పరిస్థితిలో లేవు' అని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జీవా అన్నారు. ఈ సంక్షోభ పర్యవసానంగా సాంఘిక అశాంతి పెరుగుతుంది. అది ఈ సంక్షోభాన్ని మరింత పెంచుతుంది.
ప్రభుత్వాలు ద్రవ్యోల్బణాన్ని తక్షణమే అదుపు చేసే ద్రవ్య విధానాలను చేపట్టాలని, మూడో ప్రపంచ దేశాల రుణ భారాన్ని తగ్గించే విధంగా నిర్ణయాలను తీసుకోవడానికి సంపన్న దేశాలు ముందుకు రావాలని క్రిస్టాలినా సూచించారు. తక్షణమే ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు తీసుకోవడం అత్యవసరం అని ఆమె అభిప్రాయపడ్డారు.
కాని 'ఎద్దు పుండు కాకికి రుచి' అన్న చందాన సంపన్న దేశాలు వ్యవహరిస్తున్నాయి. ఇక మన దేశంలో మోడీ ప్రభుత్వ వైఖరి కూడా ఇందుకు భిన్నంగా లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతూ పోతూనే వున్నారు. దానికి తోడు విద్యుత్‌ చార్జీల భారాన్ని సైతం మోపుతున్నారు. ఉపాధి హామీ కేటాయింపులు తగ్గాయి. తాజాగా జిఎస్‌టి రేట్లను సవరించి మరింత ఆదాయాన్ని సమీకరించే యోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్‌ చార్జీలను, ఆర్టీసీ చార్జీలను పెంచేసింది. ఇప్పుడు చౌకబియ్యం స్థానే నగదు బదిలీ ప్రవేశ పెట్టాలని ముందడుగు వేసింది. ఎందుకీవిధంగా జరుగుతోందని నిలదీస్తే 'కేంద్రం చెప్పింది. మేం అమలు చేస్తున్నాం' అంటూ సమర్థించుకోడానికి ప్రయత్నిస్తోంది.
కేంద్రం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే ప్రత్యేకంగా ఆదేశాలు ఇస్తోందా? తమ ఆర్థిక వ్యవహారాలను ఏ విధంగా నిర్వహించుకోవాలో నిర్ణయించుకునే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు వుండవా? తక్కిన ఏ రాష్ట్రాలలోనూ జరగని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే నయా ఉదారవాద విధానాల అమలు మోతాదు ఎక్కువగా ఎందుకు వుంది?
విద్యా విధానంలోగాని, విద్యుత్‌ రంగంలోగాని, చెత్తపన్ను వంటి యూజర్‌ చార్జీల విషయంలోగాని, సముద్ర తీరంపై పెత్తనాన్ని బడా కార్పొరేట్లకు కట్టబెట్టే విషయంలోగాని, తాజాగా రేషన్‌ బియ్యం బదులు నగదు బదిలీ విధానం అమలు చేయడంలోగాని ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఎందుకు ముందు వుంది? ఈ ప్రశ్నలకు జగన్‌ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి.
సంక్షోభ భారాలతో ప్రజలు నలిగిపోతుంటే బిజెపి-హిందూత్వ శక్తులు మాత్రం విద్వేష జ్వాలలను ఎగదోస్తూనే వున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం లక్ష్య పెట్టకుండా దేశ రాజధానిలోనే బుల్డోజర్లతో జహంగీర్‌పురిలో ఇళ్లను కూల్చివేయడానికి పూనుకోవడం యథాలాపంగా జరిగినది కాదు. ఈ ధోరణి వెనక మోడీ-షా ద్వయం ఇస్తున్న దన్ను ప్రధాన కారణం.
అటు సంక్షోభ భారాలు, ఇటు విద్వేషపూరిత దాడులతో నలిగిపోతున్న ప్రజానీకాన్ని సంఘటితం చేసి, వారికి ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన బాధ్యత వామపక్షాల మీదే వుంది. జహంగీర్‌పురి లో బృందాకరత్‌ ప్రజలకు అండగా నిలిచిన తీరు అభినందనీయమే కాదు. మనమంతా ఆచరించాల్సిన విధానం.

- సుబ్రమణ్యం