Nov 10,2023 21:40

ద్విచక్రవాహనదారుడు మృతి
బస్సు కండిషన్‌ సరిగా లేదని తెలిపిన డ్రైవర్‌
ప్రజాశక్తి - వీరవాసరం

               విజయవాడ బస్టాండ్‌లో ఆర్‌టిసి బస్సు దూసుకెళ్లిన సంఘటన మరువక ముందే అదే తరహాలో మరో ఆర్‌టిసి బస్సు అదుపుతప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు దూసుకెళ్లింది. వీరవాసరం జాతీయ రహదారిపై శుక్రవారం మండల కార్యాలయాల సముదాయం ముఖద్వారం వద్దకు దూసుకొచ్చి ద్విచక్రవాహనదారుడిని ఢ కొట్టడంతో అతను మృతి చెందాడు. మృతుడు పాలకొల్లు మండలంలోని తిల్లపూడి గ్రామానికి చెందిన కాజా శ్రీనివాసరావు (52)గా పోలీసులు గుర్తించారు. మృతుని మేనళ్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. భీమవరం డిపోకు చెందిన బస్సు పాలకొల్లు నుంచి భీమవనం వైపు వెళ్తుంది. సంఘటన జరిగిన ప్రాంతానికి వచ్చేసరికి రోడ్డుకు ఎడమ పక్కగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా కుడి పక్కకు దూసుకొచ్చిందని స్థానికులు తెలిపారు. బస్సు కండిషన్‌ సక్రమంగా లేకపోవడంతో అదుపు తప్పిందని డ్రైవర్‌ తెలిపాడని ఎస్‌ఐ చెప్పారు. దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉందన్నారు. బస్సు బ్రేక్‌ వేస్తుంటే కుడి పక్కగు లాగేస్తుందని, ఈ విషయం బస్సును డిపో నుంచి తీసుకున్నప్పుడే అక్కడ ఉన్న పరిశీలన అధికారులకు తెలిపానని, బస్సులు తక్కువగా ఉండటం వల్ల తీసుకెళ్లమన్నారని ప్రాథమిక విచారణలో డ్రైవర్‌ తెలిపినట్లు ఎస్‌ఐ చెప్పారు. అధికారులు, ప్రజలు మండల కార్యాలయాల వద్దకు నిత్యం వస్తూ ఉంటారు. ఇదే ప్రాంతంలో అక్కడే ఉన్న వెల్డింగ్‌ షాపులో నిత్యం పని చేసుకుంటూ ఉంటారు. ప్రమాద సమయంలో అక్కడ అంతగా జనసంచారం లేదని, లేకపోతే ఎక్కువ స్థాయిలో ప్రాణనష్టం జరిగి ఉండేదని పలువురు తెలిపారు.