
ప్రజాశక్తి-ఆలమూరు ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడొస్తుందో... దశాబ్దాల నరకయాతన తీరేదెన్నడో... అంటూ వాహనచోదకులు నిత్య ప్రయాణంలో ఆవేదన చెందని రోజు లేదు. అదే ఈ ఫోటోల్లో కనిపిస్తున్న రోడ్లను చూశారా...! ఎటు చూసినా గోతులు పడి వాహనదారులకు భయానక వాతావరణం కలిగిస్తోంది... చిన్న వర్షానికే మడుగులను తలపిస్తూ అడుగు వేయలేని పరిస్థితి... దశాబ్ద కాలంగా ఈ రహదారి ఇలానే ఉండటంతో ప్రయాణికులు నానా అవస్థలూ పడుతున్నారు.
కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి మేజర్ పంచాయతీకి సంబంధించిన ప్రధాన రహదారి నుంచి తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వీరవరం వెళ్లే మార్గమిది. ఈ ప్రధాన రహదారితో పాటుగా మడికి రావిచెట్టు దగ్గర నుంచి చిలకలపాడు మీదుగా గాంధీనగరం వెళ్లే రహదారి ఉన్నాయి. ఇవి మడికి మేజర్ పంచాయతీకి అత్యంత ప్రధానమైనవిగా ఉన్నాయి. మండలానికి చివరగా ఉండే ఈ గ్రామంలో అత్యధికంగా సామాన్య కుటుంబికులు నివసిస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు ఓట్ల సమయంలో తప్ప, ఇతర సమయంలో గుర్తుకు రాదనడానికి ఎందరు పాలకులు మారినా గ్రామాభివద్ధికి పట్టించుకున్న నాథుడే కరువు అవడానికి నిదర్శనం. ముఖ్యంగా మడికికి అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ రోడ్డు నాలుగు లైన్ల ఎన్‌హెచ్ 216 ఎ వద్ద మొదలై వీరవరం వద్ద ఆర్ అండ్ బి రహదారిని కలుస్తోంది. మడికి ప్రధాన ఎంపిపి పాఠశాల, చిలకలపాడు ఎంపిపి పాఠశాలలు ఈ మార్గాల్లోనే ఉన్నాయి. ఈ రహదారి పొడవు సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారిలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తూ పలుమార్లు జారి పడి గాయాలు పాలైన సంఘటనలు ఉన్నాయి. రెండు కిలోమీటర్ల మేర ఉన్న చిలకలపాడుకు ప్రధానమైన రహదారిగాను ఉంది. గతంలో జిల్లా పరిషత్ పరిధిలో ఈ రహదారి అభివద్ధికి నోచుకునేది. ప్రస్తుతం ఏ పరిధిలో ఉందో అగమ్యగోచరంగా ఉన్న ఈ ఐదున్నర కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహదారులపై ప్రయాణం అంటే వాహనదారులు హడలెత్తిపోతూ దూరమైన వేరే మార్గాలను ఎంచుకొంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తూ పట్టనట్లు వ్యహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాం చివర్లో ఈ రోడ్డు నిర్మాణానికి హడావిడి చేసి రూ.72 లక్షలు మంజూరు చేశారు. అప్పటి శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రమణ్యం శిలాఫలకం కూడా ఆవిష్కరించారు. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో కాంట్రాక్టర్లు బిల్లులు మంజూరు కావని భావించి పనులు ప్రారంభించలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో పనులు ఏమాత్రం మొదలు కాలేదు. కంటి తుడుపు చర్యలుగా భావించే విధంగా అప్పుడప్పుడు పంచాయతీ వారు తాత్కాలికంగా గ్రావెల్‌తో గోతులు పూడ్చినప్పటికీ వర్షం వచ్చి యధావిధిగా మారుతుంది. ఇదే అదనుగా భావించి కొందరు స్వార్ధపరులు రోడ్డు ఇరువైపులా పలు ఆక్రమణలకు పాల్పడడంతో మార్గం కుచించుకుపోతోంది. ఇంత జరుగుతున్నా పాలన యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా స్థానిక పెద్దలు పార్టీలకు అతీతంగా వ్యవహరించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని, పటిష్టమైన రోడ్లను నిర్మిచంరాలని ప్రజలు కోరుతున్నారు.