చెరువులను తలపిస్తూ రోడ్లపై గోతుల్లో వర్షపు నీరు
ఏజెన్సీ, డెల్టాలోనూ అత్యంత దారుణంగా రహదారి వ్యవస్థ
జంగారెడ్డిగూడెం - బుట్టాయగూడెం రోడ్డు అధ్వానం
ఏలూరు - కైకలూరు రోడ్డు చూస్తేనే హడల్
నవుడూరు - పొలమూరు రోడ్డు గతుకులమయం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్‌అండ్‌బి రహదారుల వ్యవస్థ దారుణంగా మారింది. వర్షాలకు రోడ్లపై గోతుల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో జనం రోడ్లపై రాకపోకలు సాగించేందుకు నరకం అనుభవిస్తున్నారు. నిత్యం ప్రమాదాల బారిన పడుతూ గాయాల పాలవుతున్నారు. ఏజెన్సీ, డెల్టా అనే తేడా లేకుండా రోడ్ల వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. వైసిపి అధికారం చేపట్టి నాలుగేళ్లయినా రోడ్ల గురించి పట్టించుకోని దుస్థితి ఉంది. దీంతో రోడ్లు మరింతగా దెబ్బతినడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,200 కిలోమీటర్ల వరకూ ఆర్‌అండ్‌బి రోడ్ల వ్యవస్థ ఉంది. గత టిడిపి ప్రభుత్వం జిల్లాలోని రోడ్ల గురించి పట్టించుకోలేదు. దీంతో 2019 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం వైసిపి అధ్వాన రోడ్లపై అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు వేస్తామని చెప్పింది. గోతులమయంగా మారిన రోడ్ల గురించి ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రస్తుత ఎంఎల్‌ఎలుగా ఉన్న నాయకులంతా పాదయాత్రలు, ఆందోళనలు చేశారు. తీరా అధికారంలోకొచ్చాక వైసిపి ప్రభుత్వం రోడ్ల గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో రోడ్ల వ్యవస్థ మరింత అధ్వానంగా తయారైంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు చూస్తే భయంగొలిపే పరిస్థితి ఉంది. జంగారెడ్డిగూడెం-బుట్టాయగూడెం ప్రధాన రహదారి పెద్దపెద్ద గోతులతో దారుణంగా తయారైంది. వర్షాలకు గోతుల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. బుట్టాయిగూడెం- దొరమామిడి, దొరమామిడి- పందిరిమామిడిగూడెం, కన్నాపురం- పులిరామన్నగూడెం రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఈ రోడ్ల వెంట రాకపోకలు సాగించలేక జనం నిత్యం నరకం అనుభవిస్తున్నారు. మండల కేంద్రం కుక్కునూరు నుంచి లంకాలపల్లి వరకూ ఉన్న ప్రధాన రహదారి చూస్తే వణుకు పుట్టాల్సిందే. ఆ రోడ్డు గుండా వాహనాలపై చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అదుపు తప్పితే ప్రమాదాలకు గురికావాల్సిందే. జీలుగుమిల్లి మండలంలోనూ పలు గ్రామాల రోడ్ల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణమంటేనే గుండె గుభిల్లుమంటోంది. రెండు రోజుల క్రితం రోడ్డు దుస్థితికి నిరసనగా ఒక యువకుడు రోడ్డుపై మంచెం వేసి పడుకున్న సంగతి తెలిసిందే. డెల్టాలోని పలు మండలాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. పెనుమంట్ర మండలం పొలమూరు-నవుడూరు మధ్య రోడ్డు గతుకులమయంగా మారినా స్పందించిన దాఖలాల్లేవు. మొన్నటి వరకూ జెడ్‌పి ఛైర్మన్‌గా, ప్రస్తుతం ఎంఎల్‌సిగా ఉన్న కవురు శ్రీనివాస్ స్వగ్రామం పొలమూరు, ప్రస్తుతం నివాసం ఉంటున్న నవుడూరు గ్రామాల మధ్య రోడ్డుకే దిక్కు లేకుండాపోయిందని అక్కడి ప్రజలు ప్రభుత్వం తీరుపై పెదవి విరుస్తున్నారు. నెలమూరు-మడుగుపోలవరం, పెనుమంట్ర-జుత్తిగ, పొలమూరు-బ్రాహ్మణచెర్వు రోడ్లు సైతం ఇదేవిధంగా తయారయ్యాయి. ఇరగవరం మండలంలో కంతేరు నుంచి పెనుగొండ వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. పెనుగొండ మండలంలో దేవ గ్రామానికి వెళ్లే రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు పెద్దఎత్తున ఆర్‌అండ్‌బి రోడ్ల వ్యవస్థ దెబ్బతింది. ఒకటీ అరా రోడ్లు వేస్తున్నా అత్యధిక రోడ్లు గోతులమయంగానే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వ తీరుపై జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.










