
వర్షాభావంతో ఎండుతున్న వరి పంటలు
గుడిపాడు రావికుంట చెరువు ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరం
వ్యవసాయ విద్యుత్ కోతలతో బోర్ల కింద రైతులదీ అదే పరిస్థితి
ప్రజాశక్తి - ముసునూరు
చినుకు జాడ లేదు.. చెరువులు అడుగంటాయి.. ఇప్పటి వరకూ వర్షం కోసం ఆశగా ఎదురు చూసిన రైతులకు చివరకు నిరాశే మిగిలింది. వర్షాలు పడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. వానాకాలం మూడు నెలలు ముగిసిపోయాయి. దీంతో వర్షాల మీద ఆధారపడి సాగుచేసిన పంటలు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. చెరువులు, బోర్ల కింద పంటలు సైతం ఎండిపోతున్నాయి. చెరువు నీటితో కొంతవరకు పంటను కాపాడుకుంటూ వచ్చిన రైతులు అవికాస్తా అడుగంటడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు ఏడాదికి ఒకసారి పండించే వరి పంట కూడా పండకపోతే ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి చి'వరి' దశకు తీసుకొచ్చిన పంట నీరు లేక ఎండిపోతుంటే ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, తమను ఆదుకోవాలంటూ మండలంలోని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ముఖ్యంగా మండలంలోని గుళ్లపూడి రెవెన్యూ గ్రామ పరిధిలోని గుడిపాడు రావికుంట చెరువు కింద 279 ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. ప్రస్తుతం ఈ చెరువు అడుగంటింది. దీంతో చెరువు ఆయకట్టులోని పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు పంటను ఎలా కాపాడుకోవాలో అర్థంకా మదనపడుతున్నారు. వర్షం కురిస్తే తప్ప చెరువులోకి నీరు వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతునాన్నరు.
బోర్లకిందా అదే పరిస్థితి
బోర్లమీద ఆధారపడి సాగుచేసిన రైతుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. మాండలంలో సుమారు 5600 ఎకరాల్లో వరిపంటను సాగుచేశారు. పంట చివరి దశకు చేరుకుంటోంది. అయితే వ్యవసాయానికి ఇస్తున్న తొమ్మిది గంటల విద్యుత్ సక్రమంగా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తరచూ విద్యుత్ కోతలతో వరిచేలకు నీరు చాలక ఎండిపోతున్నాయి. దీనికితోడు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో నీరుపెట్టినప్పటికీ ఎక్కువ సమయం ఉండటం లేదని, తరచూ నీరు పెట్టాల్సి వస్తోందని, కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంట చివరి దశలో పుష్కలంగా నీరు ఉండాలని, లేకుంటే దిగుబడి పడిపోతుందని రైతులు వాపోతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కౌలురైతుల పరిస్థితి దారుణం
మండలంలోని కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వర్షాభావంతో సాగునీరు లేక కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేని వాపోతున్నారు. ఈసారి లాభాల సంగతి ఎలా ఉన్నా కౌలు ఖర్చులు కూడా వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు కౌలు ఖర్చులు కలుపుకుని సుమారు రూ.40 వేల వరకూ ఖర్చు చేశామని, ప్రస్తుతం తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీరులేక పంట పూర్తిగా ఎండిపోయింది
బి.జయమ్మ, రైతు, గుళ్లపూడి
నా భర్త చనిపోయినప్పటినుండి నా పిల్లలతో కలిసి 2.70 ఎకరాల్లో వరి పంట సాగుచేస్తున్నాను. ఈ పంటే నాకు ఆధారం. కానీ ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో పంట చేతికొచ్చే సమయంలో చెరువులో నీళ్లు లేక వరి పంట పూర్తిగా ఎండిపోయింది. మాది ఉమ్మడి కుటంబం. కుటుంబ పోషణ కష్టంగా మారింది.
పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు
మారుమూడి భూషణం, రైతు, గుళ్లపూడి
మా అన్నదమ్ములందరం కలిసి మా నాన్న ఇచ్చిన 1.50 ఎకరాల్లో వరి సాగుచేశాము దుక్కులు మొదలు, వరి నారు కోనడం, పంట నాటడానికి కూలీల ఖర్చు, ఎరువుల ఖర్చు, రసాయన ఎరువుల ఖర్చు, కలుపు కూలీల ఖర్చు భారీగా పెట్టుబడి పెట్టాము. పంట చేతికోచ్చేసమయంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం ఆదుకోవడమో.లేదా సాగునీరు ఆందించడమో చేయాలని, పంటకు మొత్తం ఖర్చు పెట్టి పండే దశలో ఇలా ఎండిపోతంటే మా భాధను ప్రభుత్వం గుర్తించాలి.
ప్రభుత్వమే ఆదుకోవాలి
పంతగాని తిరుపతి స్వామి, రైతు, గుళ్లపూడి
నాకు ఉన్న ఎకరం పోలంలో వరి పంట సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఈ సంవత్సరం వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
నష్టం వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేశాం
ఎస్.మధుమోహన్, మండల వ్యవసాయాధికారి
గుడిపాడులోని రాయకుంటచెరువు కింద సాగుచేసిన వరి పంటను పరిశీలించాను. సుమారు 40 నుంచి 50 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. దీన్ని బట్టి మండలంలోని వరి పొలాల పరిస్థితిపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాము.