ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు అంతరించిపోవడంతో రాబోయే రోజుల్లో రాష్ట్రం అంధకారమయం కానున్నది. బొగ్గు నిల్వలు తగినంతగా ఉన్నాయా లేవా అని ముందుచూపు లేనట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్రజలకు విద్యుత్ పొదుపు గురించి ఉచిత సలహాలు మాత్రం ఇస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. సాయంత్రం పూట ఆరు గంటల నుండి పది గంటల వరకు ఏసీలు వాడొద్దని సెలవిస్తున్నారు.
దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వల కొరత ఏర్పడటం, కేంద్రం నుంచి సహకారం లభించకపోవడం వంటి కారణాలతో రాష్ట్రం లోని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు బొగ్గు సంక్షోభం బారిన పడ్డాయి. ఇప్పటికే చాలా వరకూ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు దాదాపు అంతరించిపోయాయి. దీంతో కొన్ని రోజులుగా సగం కెపాసిటీ మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యుత్ కోతలు విధిస్తోంది.
తెలంగాణ లోని సింగరేణి గనులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ లోని పవర్ ప్లాంట్లకు రావాల్సిన బొగ్గు నిల్వలు దాదాపుగా నిలిచిపోవడంతో పవర్ ప్లాంట్లు అల్లాడుతున్నాయి. మన రాష్ట్రంలో 9 ధర్మల్ విద్యుత్ ఆధారిత ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో విశాఖ జిల్లా పరవాడ లోని ఎన్టీపీసీ సింహాద్రి సూపర్ ధర్మల్ పవర్ ప్లాంట్‌లో 2000 మెగావాట్లు, గాజువాక లోని వీటీపీఎస్ లో 1040 మెగావాట్లు, విజయవాడ లోని ఎన్టీపీఎస్ లో 1760 మెగావాట్లు, కడప జిల్లా ముద్దనూరు లోని ఆర్టీపీఎస్ లో 1650 మెగావాట్లు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని డీఎస్టీపీఎస్ లో 1600 మెగావాట్లు, సింహపురి ధర్మల్ పవర్ స్టేషన్లో 600 మెగావాట్లు, మీనాక్షి ధర్మల్ పవర్ స్టేషన్లో 1000 మెగావాట్లు, సెంబ్ కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ లో 1320 మెగావాట్లు, ఎస్జీపీఎల్ పవర్ స్టేషన్లో 1320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ఈ మొత్తం ప్లాంట్లు కలిపి 12 వేల 290 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. కాని బొగ్గు కొరత కారణంగా సగం ఉత్పత్తే సాధ్యమవుతోంది. కొన్ని రోజులుగా ఇదే పరిస్ధితి. ప్లాంట్లు పూర్తిగా పని చేయకపోవడంతో ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి కూడా భారీగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. రేపు, ఎల్లుండి కల్లా మిగిలిన నిల్వలు కూడా తరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. అప్పుడు ధర్మల్ విద్యుత్ ప్లాంట్లన్నీ మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో ప్రతిరోజూ దాదాపు 2000 మెగావాట్లకు పైగా కొరత ఏర్పడుతోంది. ఇది ఇవాళ రేపట్లో మరింత ఎక్కువ కానుంది. సంక్షోభం తీవ్రతరం అయితే, డిస్కమ్‌లు బహిరంగ మార్కెట్ నుండి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడడడంతో....బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. అలా చేయాలన్నా ప్రభుత్వం దగ్గర తగినన్ని నిధులు ఉండాలి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం...ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. పైగా ఇప్పటికే ఆస్తి పన్ను, ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీల పెంపుదలపై ప్రజాగ్రహనికి గురైంది. ఇప్పుడు విద్యుత్ కొనుగోలుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి డిస్కంలపై ఆర్థిక భారం తగ్గించాలంటే విద్యుత్ చార్జీలు పెంచక తప్పదు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రతి రోజు డీజిల్, పెట్రోలు, గ్యాసు నిత్యావసర సరుకులు ధరలను పెంచుకుంటూ పోతోంది కేంద్ర ప్రభుత్వం. చెంప దెబ్బ గోడ దెబ్బ మాదిరిగా తయారైంది రాష్ట్ర ప్రజల పరిస్థితి.
- డా|| ఎం. సురేష్ బాబు










