ప్రజాశక్తి - ఏలూరు టౌన్
తమ సమస్యల పరిష్కారం కోరుతూ చలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నిర్బంధంతో ఉక్కుపాదం మోపింది. జిల్లా నలుమూలల నుండి విజయవాడ వెళ్లేందుకు బస్సులు, రైళ్లు, ప్రయివేటు వాహనాల్లో బయల్దేరిన అంగన్వాడీలను జాతీయ రహదారిపై కలపర్రు టోల్‌గేట్ వద్ద బలవంతంగా వాహనాలు దింపి పెదపాడు పోలీస్ స్టేషన్, ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్, సీతారంభర్తియా కళ్యాణ మండపం తదితర ప్రాంతాలకు తరలించారు. దాదాపు 500 మంది అంగన్వాడీలనూ అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారు. ఈ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు ఆయా స్టేషన్ల ముందు, మర్చంట్ ఛాంబర్ కార్యాలయం ముందు పెద్దఎత్తున తమ నిరసన తెలిపారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ సిఐటియు, ప్రజాసంఘాలు ఆధ్వర్యాన చేపట్టిన ఆందోళనకు సిపిఎం మద్దతు ప్రకటించింది. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ నుండి భర్తియాఛాంబర్ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ అక్కడే రోడ్డుపై పడుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి పి.కిషోర్, సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు బి.జగన్నాధరావు, వి.సాయిబాబు, ఆటోవర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జె.గోపీ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లెనిన్, మెడికల్ రిప్స్ రాష్ట్ర నాయకులు ప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జాన్‌బాబు, అంగన్వాడీ యూనియన్ ఏలూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు రజిని, జిల్లా నాయకులు పిఎల్‌ఎస్.కుమారి, తదితరులు నాయకత్వం వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలను ఆంధ్రప్రదేశ్ చేతి వత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు, కోకన్వీనర్ ఆగోల్ల వెంకట కృష్ణారావు తీవ్రంగా ఖండించారు స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని వృత్తిదారుల జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జంగారెడ్డిగూడెం: సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ ధర్నాకు బయల్దేరిన అంగన్వాడీలను పోలీసులు సోమవారం ఉదయం అడ్డుకున్నారు. స్థానిక బస్టాండుకు చేరుకున్న అంగన్వాడీలను విజయవాడ వెళ్లకుండా బస్టాండులోనే నిర్బంధించారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో అంగన్వాడీలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనకు పలు ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. అనంతరం బస్టాండ్ నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఓ దశలో అంగన్వాడీల ఆందోళనను పట్టించుకోని ఆర్‌డిఒ ఝాన్సీరాణి తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి పి.భారతి మాట్లాడుతూ అంగన్వాడీలు కేంద్రాల్లో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పందించి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అనంతరం ఆర్‌డిఒ ఝాన్సీరాణికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మానుకొండ జీవరత్నం, నేత అందుగుల ప్రభాకర్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్, మాబు సుభాని, సిఐటియు నేతలు పి.సూర్యారావు, ఎస్‌కె.సుభాషిని, వంగా గోపీ, అంగన్వాడీలు పాల్గొన్నారు. అంగన్వాడీలపై నిర్బంధాన్ని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్ ఖండించారు.
చింతలపూడి: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నాకు వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిఐటియు నేతలు నత్త వెంకటేశ్వరావు, ఎస్.సూర్యకుమార్, ఐద్వా నేత వరలక్ష్మి ఖండించారు. అక్రమ అరెస్టులు నిరసిస్తూ స్థానిక పోలీసు స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి వారు మాట్లాడారు. అర్ధరాత్రి వెళ్లి మహిళలకు నోటీసులివ్వడం దారుణమన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రమాదేవి, లక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు.
మండవల్లి: అక్రమ అరెస్టులు చేసి ఉద్యమాలను ఆపలేరని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ మండవల్లి ప్రాజెక్టు నేత వాణి స్పష్టం చేశారు. విజయవాడ ధర్నాకు వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకుని అంగన్వాడీలపై రాజకీయ ఒత్తిళ్లను ఉపసంహరించుకుని పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ద్వారకాతిరుమల: విజయవాడలో తలపెట్టిన ధర్నాకు వెళ్లనీయకుండా మండలంలోని అంగన్వాడీలను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. పలువురు కార్యకర్తల ఇళ్లకు సచివాలయ మహిళా కార్యదర్శులు వెళ్లి విజయవాడ వెళ్లొద్దంటూ నోటీసులిచ్చి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
పెదపాడు: చలో విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేసి పెదపాడు పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. కాకినాడ, విశాఖపట్నం, పశ్చిమగోదావరి తదితర జిల్లాల నుండి విజయవాడ వెళ్తున్న అంగన్వాడీలను కలపర్రు టోల్‌గేట్ వద్ద ఆదివారం అర్దరాత్రి, సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేసి పెదపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో సిఐటియు ఆధ్వర్యాన చేపట్టిన ఆందోళనకు ఎపి రైతుసంఘం, సిపిఎం నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సిఐటియు మండల కార్యదర్శి రెడ్డి లక్ష్మణరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కాకినాడ జిల్లా నాయకులు ఫాతిమా, సిపిఎం మండల నాయకులు షేక్ కరీముల్లా మాట్లాడారు. ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎ.శాంతరత్నం, పి.కనకతులసి, సిహెచ్.రాణి పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: చలో విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను, మధ్యాహ్న భోజన కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం దారుణమని సిఐటియు నేత శుక్లబోయిన రాంబాబు అన్నారు. కొయ్యలగూడెంలో ప్రభుత్వ నిర్బంధంపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఆకుల దుర్గారావు, తగర ధనరాజు, కె.సీతారాముడు, ఎస్.శివకుమార్, సిహెచ్.మరిడియ్య పాల్గొన్నారు.
జీలుగుమిల్లి: అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులపై నిర్బంధాన్ని నిరసిస్తూ సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యాన సోమవారం స్థానిక జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు, నేతలు జి.వెంకట్రావు, ఎన్‌వి.అప్పారావు, సిఐటియు నేతలు సిహెచ్.కొండలరావు,కారం భాస్కర్, శ్రీను, మొడియం లక్ష్మి, ఎన్.భీమశంకరం పాల్గొన్నారు.
టి.నరసాపురం: చలో విజయవాడకు వెళ్లనీయకుండా మండలంలోని బండివారిగూడేనికి చెందిన అంగన్వాడీ సెక్టార్ లీడర్ సత్యవతిని పోలీసులు ఇంటి వద్దే నిర్బంధించారు. సోమవారం ఉదయం విజయవాడ బయల్దేరిన పలువురిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. చింతలపూడి, నూజివీడు పోలీసుస్టేషన్లలో మక్కినవారిగూడెం ప్రాంత అంగన్వాడీలను నిర్బంధించారు. పోలీసుల తీరును సిఐటియు మండల కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ ఖండించారు.
కుక్కునూరు: అంగన్వాడీ, మధ్యాహ్న భోజనకార్మికులు చేపట్టిన చలో విజయవాడకు వెళ్లనీయకుండా నిర్బంధించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కుక్కునూరు ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. నిరసనలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి నాగేంద్రరావు, సిఐటియు నేతలు యర్నం సాయికిరణ్, ఎం.రమాదేవి, అన్నపూర్ణ, సౌజన్య, కృష్ణవేణి, వెంకటేశ్వర్లు, శివ, రమేష్, ఉదరు పాల్గొన్నారు.
ఉంగుటూరు: విజయవాడ ధర్నాకు వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను చేబ్రోలు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంగన్‌వాడీల ఆందోళనకు కొర్ని అప్పారావు సంఘీభావం తెలిపారు.
వేలేరుపాడు: ఉక్కుపాదంతో కార్మిక ఉద్యమాలను ఆపలేరని సిఐటియు జిల్లా నాయకులు మడివి దుర్గారావు అన్నారు. దుర్గారావును సోమవారం స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అంగన్వాడీ, సిఐటియు నేతల అక్రమ అరెస్టులను సిపిఎం మండల కార్యదర్శి ధర్ముల రమేష్ ఖండించారు.
నూజివీడు: అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన ముఖ్యమంత్రి అక్రమ అరెస్టులకు పాల్పడటం దారుణమని సిఐటియు జిల్లా కార్యదర్శి జి.రాజు, ఎన్‌ఆర్.హనుమాన్ అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బుట్టాయగూడెం: మండలం నుండి విజయవాడ వెళ్తున్న అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను తడికలపూడి వద్ద అరెస్ట్ చేశారు. అలాగే మండలంలోని అంగన్వాడీలను, మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు.










