- కనీస వేతనాలకు నోచని అంగన్‌వాడీలు
- గ్రామాల్లో రాజకీయ వేధింపులు
- అంగన్‌వాడీ సమస్యలపై యూనియన్ అలుపెరగని పోరు
- నేడు అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: అసలే అరకొర వేతనాలు... ఆపై రకరకాల పనులు అప్పగింత... ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత ఊసెత్తని పాలకులు... రిటైర్ అయిన తర్వాత ఉత్త చేతులతోనే సాగనంపుతున్న పాలకులు. ఇవి చాలవన్నట్లు గ్రామాల్లో రాజకీయ వేధింపులు. తమ పార్టీకి చెందిన వ్యక్తులను నియమించుకోవాలనే అత్యుత్సాహంతో పనిచేస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా తొలగింపులు. ఇవీ అంగన్‌వాడీ వర్కర్లకు నిత్యం ఎదురవుతున్న సమస్యలు. వీటిపై అంగన్‌వాడీలను సమీకరించి వారిలో చైతన్యం నింపుతూ పోరాటాల వైపు మలచడంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కీలకపాత్ర పోషిస్తోంది. మూడేళ్లుగా పలురకాల పోరాటాలు సాగించి అనేక విజయాలు సాధించిన యూనియన్, పలాస వేదికగా జిల్లా ఎనిమిదో మహాసభలకు సిద్ధమవుతోంది.
జిల్లాలో 15 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,358 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 2,759 మెయిన్, 599 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 60,029 మంది, మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు 36,990 మంది ఉన్నారు. వీరితోపాటు 12,229 మంది గర్భిణులు, 13,275 మంది బాలింతలు ఉన్నారు. 2,759 మంది అంగన్‌వాడీ వర్కర్లు, అదే సంఖ్యలో హెల్పర్లు పనిచేస్తున్నారు. వీరితో పాటు 599 మంది మినీ అంగన్‌వాడీ వర్కర్లు పనిచేస్తున్నారు. అంగన్‌వాడీలకు ప్రభుత్వం నెలకు రూ.11,500, హెల్పర్లు, మినీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి రూ.ఏడు వేలు చెల్లిస్తోంది. 2019లో స్పల్పంగా వేతనాలు పెంచిన తర్వాత నాలుగేళ్లుగా ఒక్క పైసా పెంచలేదు. దీనిపై అంగన్‌వాడీ వర్కర్లు అనేక ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అరకొర వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం, వారితో బండెడు చాకిరీ చేయిస్తోంది. ఎన్నికల విధులకు సంబంధించి బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్‌ఒ)గా వారికే విధులు అప్పగించింది. యాప్‌ల్లో వివరాల నమోదుతో పాటు 25 రకాల రికార్డులను రాయిస్తుండడంతో, ఒత్తిడితో రోగాల బారిన పడుతున్నారు. ఇఎస్‌ఐ అమలు చేయాలని చాలా ఏళ్లుగా మొర పెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
అలుపెరుగని పోరాటాలు
అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలపై యూనియన్ అలుపెరుగని పోరాటాలు సాగిస్తోంది. తెలంగాణ మాదిరిగా వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు వంటి డిమాండ్లతో ఈనెల 11న కలెక్టరేట్ వద్ద 48 గంటల ధర్నా చేపట్టింది. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం మరుసటి రోజు వారిని నిర్బంధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వేతనాల పెంపు, ఫేషియల్ యాప్ రద్దు, పర్యవేక్షణ పేరుతో వేధింపులు సమస్యలపై కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గతేడాది జూలైలో సంక్షేమ పథకాల అమలు, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ తదితర సమస్యలపై ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. స్కీమ్‌వర్కర్ల సమస్యలపై గతేడాది మార్చి 28, 29 తేదీల్లో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో అంగన్‌వాడీలు భాగస్వామ్యమయ్యారు అపరిష్కృత సమస్యలపై గతేడాది ఫిబ్రవరిలో చలో కలెక్టరేట్ చేపట్టారు. బిఎల్‌ఒ విధులు అప్పగించొద్దంటూ 2019 నవంబరులో తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు.
పోరాటాలతో అనేక విజయాలు
అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన పోరాటాలతో అనేక విజయాలు సాధించింది. అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్న పాలు పక్కదారి పట్టిన వైనంపై అధికారులు 28 అంగన్‌వాడీ కార్యకర్తలను బాధ్యులను చేయడంపై అనేకరకాల ఆందోళనలు చేసి సస్పెన్షన్లు ఆపింది. అంగన్‌వాడీ వర్కర్లకు వేతనం రూ.10 వేలు వేతనం వస్తుందనే సాకుతో వారి రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నించగా నిలువరించింది. అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న డిమాండ్‌తో పలురూపాల్లో ఆందోళనలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం అర్బన్ పరిధిలోని అంగన్‌వాడీలకు అమ్మఒడి, చేయూత వర్తింపజేసింది. గార, శ్రీకాకుళం అర్బన్, ఆమదాలవలస, కోటబొమ్మాళి, ఇచ్ఛాపురం రూరల్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులపై పోరాడి వారికి అండగా నిలిచింది.
మహాసభను జయప్రదం చేయాలి
అంగన్‌వాడీల సమస్యలపై మూడేళ్లుగా అనేక పోరాటాలను సాగించాం. ప్రభుత్వపరంగా కొన్నిరకాల ప్రయోజనాలు సాధించుకున్నాం. అంగన్‌వాడీలు దీర్ఘకాలంగా పోరాడుతున్న అనేక సమస్యలు ఉన్నాయి. కనీస వేతనాలు, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి హక్కులను సాధించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు సాగించిన పోరాటాలను మహాసభలో సమీక్షించుకుంటాం. భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకుంటాం. మహాసభకు అధిక సంఖ్యలో అంగన్‌వాడీలు తరలివచ్చి జయప్రదం చేయాలి.










