Nov 10,2023 00:25

రోడ్డు పక్కన మృతదేహం.. మృతుడు వెంకటేశ్వర్లు (ఫైల్‌)

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సోమవారం మధ్యాహ్నం నుండి కనిపించ కుండా పోయిన యువకుడు గురువారం గ్రామ సమీపంలోని కొండ పక్కన మృతిచెంది పడి ఉన్న ఘటన నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో కలకలం రేపింది. కుటుంబీకులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోపనబోయిన పేరయ్య, ఆదిలక్ష్మి దంప తులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడైన వెంకటేశ్వర్లు (28) పదో తరగతి వరకూ చదువుకుని ఆర్థిక ఇబ్బందుల కారణంగా మానేశాడు. అప్పటి నుండి చిన్నచిన్న పనులు చేసుకుంటూ వస్తున్న వెంకటేశ్వర్లు కొన్నాళ్లుగా నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వార్డు బారుగా పనిచేస్తూ ఇటీవల మానేసి మరో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం నుండి వెంకటేశ్వర్లు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పశువుల మేత కోసం పొలం వెళ్లి వస్తున్న మహిళలకు దుర్వాసన రావడంతో రోడ్డుపక్కన పరిశీలించగా మృతదేహం ఉంది. దీంతో గ్రామ పెద్దలకు చెప్పడంతో వారు పోలీసులకు సమచారం అందించారు. ఘటనా స్థలిని నరసరావుపేట రూరల్‌ పోలీసులు పరిశీలించి వాకబు చేయగా వెంకటేశ్వర్లు మృతదేహంగా గుర్తించారు. మృత దేహం బాగా పాడవడంతో అక్కడే శవపంచ నామా నిర్వహించి కుటుంబానికి అప్పజెప్పారు. అంత్యక్రియలను ఆ సమీపంలోనే పూర్తి చేశారు. మృతుని తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ హాజరత్తయ్య తెలిపారు. తన కుమారునికి స్నేహితులతో వివాదాలున్నాయని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, దీనిపై విచారణ చేసి వారిని శిక్షించాలని మృతుని తండ్రి కోరారు.