Nov 28,2022 23:05

సాంకేతిక పరిజ్ఞానంతో రెండు గంటల్లోనే ఆచూకీ లభ్యం
బాలికలు ప్రలోభాలకు గురికావొద్దు : పోలవరం డిఎస్‌పి కె.లతాకుమారి
ప్రజాశక్తి - టి.నరసాపురం

              అదృశ్యమైన బాలికల ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానంతో రెండు గంటల్లో చేధించి వారిని క్షేమంగా తల్లిదండ్రులకు పోలీసులు సోమవారం అప్పగించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు స్టేషన్‌లో పోలవరం డిఎస్‌పి కె.లతాకుమారి మాట్లాడుతూ మండలంలోని బొర్రంపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటల సమయంలో ట్యూషన్‌కు వెళ్లొస్తామని చెప్పి బయల్దేరారన్నారు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారని, ఆచూకీ తెలియకపోవడంతో ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తనకు సమాచారం అందించారని, దీనిపై వెంటనే ఏలూరులోని జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించామని చెప్పారు. బాలికల సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి ఉండటంతో జిల్లా ఎస్‌పి రాహుల్‌దేవ్‌శర్మ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాలతో జీలుగుమిల్లి సిఐ పర్యవేక్షణలో సెల్‌ ట్రాకింగ్‌ ద్వారా బాలికల ఆచూకీ గుర్తించామన్నారు. బాలికలు శ్రీకాళహస్తి వైపు వెళుతున్న బస్సులో ప్రయాణిస్తున్న విషయాన్ని నెల్లూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట హైవేలపై ఉన్నటువంటి పోలీస్‌ అధికారులకు సమాచారం అందించామన్నారు. రేణిగుంట డిఎస్‌పి, సిబ్బంది సదరు విద్యార్థినులను గుర్తించి సమాచారం అందించారని, స్థానిక పోలీసులు వారిని సురక్షితంగా అక్కడ నుంచి తీసుకొచ్చారని తెలిపారు. ఈ ఘటనలో ఫిర్యాదు అందిన రెండు గంటల వ్యవధిలోనే బాలికల ఆచూకీ కనుగొనడం అభినందనీయమన్నారు. బాలికలు ఎటువంటి ప్రలోభాలకు గురి కావొద్దని సూచించారు. దిశ యాప్‌, సాంకేతిక పరిజ్ఞానం బాలికల ఆచూకీ కనుగొనేందుకు దోహదపడ్డాయన్నారు. బాలికలు రాష్ట్రం దాటి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ ఎస్‌.రాజుకు జిల్లా ఎస్‌పి రాహుల్‌దేశ్‌ ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కె.సతీష్‌కుమార్‌, శేఖర్‌, మహిళా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.