
మనిషి వాసనకు దూరమైన/ నీలోని మానవత్వాన్ని/ నీవే పాతిపెట్టుకోవడం/ నిన్ను నీవే కోల్పోవడం కదా!' వర్తమాన సమాజంలో మానవత్వం కోసం కవిగొంతుతో పలవరించి పలవరించి ఈనెల 22న అదృశ్యమైపోయిన ఆధునిక కవి కెరె జగదీశ్. కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దులోని రాయదుర్గంలో పుట్టారు. శారదమ్మ, శరణప్ప ఆయన తల్లిదండ్రులు. వారిది కన్నడ కుటుంబం. ఆయన వృత్తిపరంగా పాత్రికేయుడు. కవత్వ రచనను ప్రవృత్తిగా మార్చుకున్నారు. రాయదుర్గంలో అనేక సాహిత్య సభలు నిర్వహించారు. పేరుమోసిన తెలుగు రచయితలను ఆహ్వానించి గౌరవించారు. 'గడినాడు' అనేక సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడంలో దిట్ట జగగీష్. తను కవిత్వరంగంలో అడుగుపెట్టి నాలుగు కావ్యాలు రచించారు. 'సముద్రమంత గాయం', 'రాతి నిశ్శబ్ధం' అనే రెండు వచన కవిత్వ సంపుటాలు; 'రాత్రి సూర్యుడు', 'ఎల్లక్క' అను వచన దీర్ఘ కావ్యాలు రాశారు. ఈ నాలుగు 2011-2020 మధ్య పదేళ్ళలోనే రావడం గమనార్హం.
జగదీశ్ రాసిన ప్రతి కవితా, ప్రతి కావ్యం మానవతాన్వేషణ చేస్తాయి. మనుషులు మననుషులుగా ప్రవర్తించకపోవడం పట్ల బాధ, మనిషిని మనిషిగా గుర్తించకపోవడం పట్ల ఆవేదన, మననుషులుగా ప్రవర్తించకపోవడం పట్ల ఆగ్రహం, మానవ సమాజం హింసాపూరితం కావడం పట్ల ఆక్రోశం ... జగదీశ్ కవిత్వంలో కనిపిస్తుంటాయి. అస్పృశ్యత, స్త్రీ వివక్ష వంటి సమస్యలను, ప్రపంచీకరణకు తోడై భారతీయ సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టివేసి వాస్తవాన్ని, జగదీశ్, అనేక రకాలుగా విమర్శకు పెట్టారు. ఆయన పీడితుల పక్షం వహించారు. సమాజంలో మానవత్వపు పునరుద్ధరణ కోసం తపించారు. జగదీశ్ చేసిన మానవత్వ కలవరింత ఆయన కవిత్వంలో ఆకర్షణీయంగా వినిపిస్తుంది.
'జీవితానికి కాగితానికి మధ్య/ రాకపోకలు సాగిస్తున్న కవిత్వం/ మానవత్వాన్ని ఊపిరిగా చేసుకొని/ అడుగులు వేస్తుంది' మానవత్వ సాధనకు కవిత్వాన్ని ఆయుధంగా ఉపయోగించుకున్న కవి జగదీశ్. మానవత్వం ఆయన కవిత్వ జెండా, అజెండా. మానవత్వ దృష్టికోణంనుంచే ఆయన అనేక సామాజిక దృశ్యాలను, సంఘటనలను ఆవిష్కరించారు. నాల్గో పాదాల ధర్మం/ తన అయిదో పాదాన్ని / నాపై మోపింది! అని భారతీయ సమాజంలో వేల ఏళ్ళుగా పాతుకుపోయిన అస్పృశ్యతా దుర్మార్గాన్ని అధిక్షేపించారు. అనేక వివక్షలు, చీలికలు గల సమాజంలో పుట్టిన కవి విశ్వజనీతను ఆకాంక్షించడం ఆ కవి సంస్కార ఔన్నత్యం. గుర్రం జాషువా అలాంటి కవి. కెరె జగదీశ్‌లో ఆ లక్షణముంది.
చదువుకోవాల్సిన వయ సులో రంగు బొమ్మల కోడిపిల్లల్ని అమ్ముతున్న పిల్లవాళ్లను చూచిన కవి చలించిపోయి 'అక్షరాల సాక్షిగా / అక్షరాలను నిర్లక్ష్యం చేస్తున్న పేదరికం/ పసితనాన్ని తాకట్టుపెట్టింది' అన్నారు. భారతదేశంలో అశాస్త్రీయ అభివృద్ధి వల్ల పేదల పిల్లలు బాల్యాన్ని ఎలా కోల్పోతున్నారో, జీవన సమరం వాళ్ళ బాల్యాన్ని ఎలా చిదిమేస్తున్నదో కవి ఆర్ద్రంగా చిత్రించారు. పేదరికపు శిలువను మోస్తూ/ బాలయేసులా సాగుతున్న / ఆకలి ప్రస్థానంలో / సంధ్యాకిరణం కన్నీరు కార్చింది/ అలాగే చిన్న బిడ్డను వీపునకు కట్టేసుకుని బిచ్చమెత్తుకుంటున్న స్త్రీని ... శిలువను మోస్తున్న యేసులా/ శిశువును భుజాన వేసుకోన్న పేదరికం / అని వర్ణించారు. చర్మకారుని జీవన దైన్యాన్ని ఆవిష్కరించి.. ఆ యింటి ముంగిట్లోని/ నిశ్శబ్ద నాదాలలో/ వేద ఘోషలు వినిపించాలి' అని నినదించారు. వేద శ్రవణం, వేద పఠనం నుంచి నిషేధింపబడిన వర్గానికి వేద ఘోష వినిపించాలని కవి కోరుకోవడం విప్లవ భావనే! పేదరికం వల్ల కన్నబిడ్డల్ని అమ్ముకోవడం, ఇతరుల కోసమే పిల్లల్ని కనడం వంటి విపరీత పరిణామాలను కవి ఉపేక్షించుకుండా విమర్శకు పెట్టారు. చదువు చెప్పే గురువులు, తమ విద్యార్థులను నాశనం చేసే దుర్మార్గం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వాతంత్య్రానంతరం భారతదేశం సాధించిన ప్రగతితో కవి సంతృప్తి చెందలేదు. స్వాతంత్య్రానంతర భారతీయ చరిత్ర పట్ల కవికి విమర్శనాత్మక దృష్టే ఉంది. అందుకే .. అరవై వసంతాల / ఈ స్వేచ్ఛానేలపై/ మహోన్నత శిఖల శిధిలాల కింద/ నలిగిపోయిన/ నాదేశ సంస్క ృతి గుండెలో/ అగ్ని పర్వతాలు రగులుతున్నాయి అన్నారు. అనేక సమస్యలకు జగదీశ్ విస్తృతార్థంతో మానవత్వమే పరిష్కారమని నిర్ణయించారు. 'ఒక కన్నీటి తడిని/ తన ఒడిలో అక్కున చేర్చుకోవడమే/ మానవీయత' అని నిర్వచించారు.
జగదీశ్ రచించిన రెండు వచన కావ్యాలు వస్తుపరంగా విశిష్టమైనవి. 'రాత్రి సూర్యుడు' దివ్యాంగులని మనం వ్యవహరిస్తున్న వారిలో అంధుని గురించిన కావ్యం. 'ఎల్లక్క' బసివిని, మాతంగి, దేవదాసి వంటి పేర్లతో పిలుస్తున్న వంచిత మహిళల గురించిన కావ్యం. 'అంధభిక్షువు' వంటి ఒకటి రెండు కవితలు తప్ప అంధుల మీద సమగ్రకావ్యం వచ్చినట్లు లేదు. 'రాత్రి సూర్యుడు' తన 'వేదనాక్షరాల కన్నీటి ధార' అని కవి చెప్పుకున్నారు. మోపూరు పెంచల నరసింహులు, గాయిత్రి, అరవింద్ వంటి తనకు తెలిసిన అంధుల జీవిత విషాదాలకు తెలుసుకొని వాళ్ళ అనుభవాలను తన వేదనాగ్నిలో కాల్చి బయటికి తీసిన కావ్యం 'రాత్రి సూర్యుడు'.
'పేగుబంధాన్ని పెనవేసుకొని/ ఉమ్మనీటిలో జారిన దేహం/ కర్రుమని అరచినా/ ఆవరించిన కారు మబ్బులతో/ కళ్ళకు ముళ్ళ తీగచుట్టుకుంది' అని మొదలయ్యే ఈ కావ్యం చదువుతున్న కొద్దీ పుట్టంధుల జీవన దైన్యం పట్ల పాఠకుల హృదయాలు ఆర్ధ్రీభూతమౌతాయి. భౌతిక నేత్రాలు లేకపోయినా మనో నేత్రాలతోనే లోకాన్ని చూడగల శక్తి వాళ్ళ సొంతం. 'కను పాపలలో చీకటి జలపాతం/ కలవర పెడుతున్నా/ మనో నేత్రాలతో వెలిగించుకున్న/ ఆశాదీపాల వెలుగులు' అని కవి అంధుల దర్శన శక్తిని వర్ణించారు. అంధుల జీవిత వాస్తవాలను చిత్రించే సమయంలో సాంద్రమైన పదా సమూహాలను ప్రయోగించే ప్రయత్నం చేశారు. పాల సముద్రాన్ని చిలికితే అమృతం, విషం వస్తుందనే పౌరాణిక సందర్భాన్ని తీసుకొని- ''చీకటి సముద్రంలో/ ఎంత చిలికినా/ చిక్కటి చీకటి తప్ప/ మరేమి ఆవిర్భవించడం లేదే?' అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న పాఠకులను కలవరపరుస్తుంది. దివ్యాంగుల పట్ల హేళనాత్మక దృష్టి గలవారికి ఈ కావ్యం కళ్ళు తెరిపిస్తుంది. కళ్ళులేని వారిని బ్రెయిలీ లిపి అందుబాటులోకి రావడం ఒక సాంకేతిక విప్లవం. దాని ద్వారా వాళ్ళు చదువుకోవడానికి వీలయింది. కవి దీని గురించీ కావ్యంతో ప్రస్తావించారు. 'చేతివేళ్ళను చీకటి సిరాలో ముంచి/ స్పర్శకు జ్ఞానచక్షువులను అతికించి/ బ్రెయిలీని ప్రేమగా/ తడుముతూ తడబడితే/ మానసికాశంలో/ వెలుగు పక్షులు రెక్కలు విప్పకుంటాయి/ అక్షరకాంతులు/ దేహమంతా వ్యాపిస్తాయి' అని చెప్పారు. రాత్రిసూర్యుడు కావ్యం సంపూర్ణంగా చదివిన వారికి సంస్కార పరమైన పరివర్తన రాక తప్పదు. కఠిన శిలలను కూడా కదిలించగల భావుకతతో కవి తన కావ్యాన్ని అలంకరించారు.
భూస్వామ్య ఆధిపత్యకుల పురుషులు తమ అదనపు ఆనందం కోసం సృష్టించుకున్న దుర్మార్గమైన వ్యవస్థ దేవదాసీ, బసివిని, జోగిని, మాతంగి మొదలైన పేర్లతో గల వ్యవస్థ. విఆర్ రాసాని రాసిన 'ముద్ర' అనే నవల ఈ వస్తువు మీద వచ్చింది. ప్రత్యేకంగా ఒక కావ్యం, వచన కావ్యం జగదీశ్ రాసిందే అనుకుంటాను. నాగప్పగారి సుందరరాజు ''నడిమింటి బోడెక్క బసివిరాలయ్యదా'' అనే కథ రాశారు. జగదీశ్ ఈ దుర్మార్గమైన వ్యవస్థ మీద ఆగ్రహంతోనే ఈ కావ్యం రాశారు. కవికి ఈ సమస్యకు మూలాలు తెలుసు. భూస్వామ్య వ్యవస్థ తెరమరుగైనా దాని అభివ్యక్తి రూపాలు ఇంకా కొనసాగుతున్నాయని, వాటిలో ఈ దేవదాసీ వ్యవస్థ ముఖ్యమని కవి అభిప్రాయపడ్డారు. ఇందులో ఎక్కువగా బలైపోయేది నిమ్న కులాల వాళ్ళేననీ, దానికి వాళ్ళ పేదరికం ప్రధాన కారణమనీ కవికి తెలుసు. ''సభ్యసమాజంలోని సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, దురాచారాల సంకెళ్ళ బిగువులో నలుగుతూ గాయపడిన స్త్రీలు నడుస్తున్న చీకటిలోకి నన్ను లాక్కెళ్లిన దుస్థితిలోనే ఎల్లక్క దీర్ఘకావ్యం నాలో ఊపిరి పోసుకుంది.'' అని జగదీశ్ ఈ కావ్యం పుట్టుకను పేర్కొన్నారు. 'విశ్వవేదికపై/ సృష్టి చరాచరరూపం/ బొమ్మల సమాహార స్వరూపం' అని కొంత భావవాదంతో ఈ కావ్యం మొదలైనా, క్రమంగా కవి సామాజిక వాస్తవికతలో నిమగమయ్యారు. 'రాజరిక భూస్వామ్య పురుష స్వామ్య వ్యవస్థలో/ అనుబంధ ప్రాత్రలుగా మారిన ఆ దేహాలు/ విలాస ప్రాంగణాలలో/ భోగలాలస పాత్రలను పోషించడం/ ఆనవాయితీగా మారింది/ దు:ఖాన్ని గొంతులోనే సమాధి చేసి / పెదవులపై వసంతాన్ని అతికించుకోవడం/ ఆ దేహాలలో కనిపించని విషాదమే'
కవికి తను తీసుకొన్న వస్తువు చరిత్ర, దాని స్వభావం, దాని ఫలితం సృష్టంగా అవగాహనలో ఉండడం అవసరం. జగదీశ్‌కు ఆ అవగాహన ఉంది. బసివినుల జీవితాన్ని కవి ఒక మాటలో 'కామదేహాన్ని తీర్చే అక్షయపాత్ర' అన్నారు. ఈ నిర్వచనం పాఠకులను దిగ్భ్రమకు గురి చేస్తుంది. ఎల్లక్క కావ్యాన్ని జగదీశ్ ఒక కథా ప్రధానమైన కావ్యంగా రచించారు. గ్రామ పెద్దల నిర్ణయానికి బలైపోయిన ఎల్లక్క కథనమే ఈ కావ్యం.
'ఇంటిలో నవ్వుల వెలుగులు నిలిపిన చిన్నారిని/ చీకటి బావిలోకి నెట్టడంగా కవి బసివిని వ్యవస్థను వర్ణించారు. బలహీన వర్గ మహిళలను సంప్రదాయం పేరు మీద, ఆధిపత్యవాదుల సుఖ లాలసతకు బలి చేసే దుర్మార్గం మీద కవి నిరసన ఈ కావ్యం. మన దేశం గురించి హెచ్చులు చెప్పే వాళ్ళకు కొదవ లేదు. అదే సమయంలో మన దేశంలోని లోపాలను ఎత్తి చూపిన వాళ్ళకు దేశ ద్రోహులనే ముద్ర పడుతున్నది. కవి జగదీశ్ - 'రాయి మనిషిగా మారిన నేలపై/ మనిషి రాయిగా మారడం అమానుషం' అన్నారు. ఈ రెండు పాదాలు మన దేశ చరిత్రలోని వెను చీకట్లను ధ్వనిస్తాయి. పాఠకులకు ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఈ దుర్మార్గం మీద తిరుగుబాటే పరిష్కారంగా కవి ప్రతిపాదించారు.
'నయవంచకులు సృష్టించిన అనాగరిక శక్తులపై/ శక్తి స్వరూపిణిలా శతసహస్ర కిరణాల వెలుగులో/ దశహస్తాలతో పదునైన ఆయుధాలు ధరించి/ ఆ దుష్టశక్తులు శిరచ్ఛేదనం చేయాలి. జగదీశ్‌ది ఉబుసుపోక మానవతావాదం కాదు. భూస్వామ్య దాన ధర్మాల మానవత్వం కాదు. కార్పొరేట్ శక్తుల వ్యాపార మానవత్వం కాదు. ఆయనది మనుషులను మనుషులుగా, సాటి పౌరులుగా గుర్తించాలనే శాస్త్రీయ మానవతావాదం. ఆయన మానవత్వం సమాజంలోని తలకిందులుతనాన్ని నిర్మూలించి నిటారుగా సమాజాన్ని నిలబెట్టే మానవతావాదం. 'సహనం కోల్పోయిన శరీరం / రాత్రంతా మంచు పూలవర్షంలో తడిసినా / లోలోన నిప్పు కణికలతో/ దగ్ధమవుతూనే ఉంటుంది.'
- రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి